Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యాప్‌ల రద్దుతోపాటు 28 ప్రధాన డిమాండ్లపై ఎస్టీయూ రాష్ట్రవ్యాప్త నిరసనలు

పరిష్కరించకుంటే 19న చలో అసెంబ్లీ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : తమ 28 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు శనివారం ఉద్యమించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం, ఆంధ్రప్రదేశ్‌ (ఎస్‌టీయూఏపీ) ఆధ్వర్యాన 28 ప్రధాన డిమాండ్ల సాధన కోసం 13 జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల ఎదుట శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 29 నెలలు పూర్తయినా వివిధ యాజమాన్యాల క్రింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఈ సందర్భంగా ఎస్టీయూ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో అనేక దఫాలుగా ప్రాతినిధ్యాలు చర్చలు జరిపినప్పటికి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. యాప్‌లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టాయిలెట్ల శుభ్రత, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, చిక్కీలు, గుడ్లు, కందిపప్పు, విద్యా కానుకల పంపిణీ తదితర వివరాలు, ఫోటోలు యాప్‌లలో అప్‌లోడ్‌ చేయడం ఉపాధ్యాయులకు తలకుమించిన భారమౌతోందన్నారు. జులై 2018 నుంచి అమలు కావలసిన 11వ పీఆర్సీ, 5 విడతల డీఏల మంజూరు, 2 విడతల డీఏల బకాయిల చెల్లింపు, సీపీిఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం విచారకరమ న్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, పురపాలక, ఎయిడెడ్‌, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల సమస్యలను ఈ సందర్భంగా నేతలు ప్రస్తావిస్తూ, ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 19వ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి (అనంతపురం), రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు (గుంటూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి (కడప), రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి.సుబ్బరాజు (కాకినాడ), ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు ఎస్‌.శ్రీనివాసరావు (మచిలీపట్టణం), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,13 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆయా జిల్లాల్లో పాల్గొని డీఈవో కార్యాలయాల్లో మొమరాండంలు సమర్పించారు. కృష్ణాగుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు గుంటూరులో పాల్గొని ఆందోళనకు సంఫీుభావం తెలుపుతూ సమస్యలు పరిష్కారానికి శాసన మండలిలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img