Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యువతే దేశానికి చోదకశక్తి

25వ జాతీయ యువజనోత్సవంలో మోదీ
పుదుచ్చేరిలో టెక్నాలజీ సెంటర్‌, ఆడిటోరియం ప్రారంభం
పుదుచ్చేరి :
యువతరమే దేశానికి చోదకశక్తి అని, పిల్లల వాక్సినేషన్‌ గతినిబట్టి దేశ యువత ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నది అర్థమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 15`18 మధ్య వయస్సువారికి ఇటీవల వాక్సినేషన్‌ ప్రారంభం కాగా అప్పుడే దాదాపు రెండు కోట్ల మంది పిల్లలు టీకాలు తీసుకున్నారని ఆయన తెలిపారు. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21ఏళ్లకు పెంచామని, తద్వారా వారికి తమ కెరీర్‌పై దృష్టి పెట్టే సమయం ఉంటుందన్నారు. కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం కావడంతో యువతది కీలకపాత్ర అని అన్నారు. కుమార్తె అయినా కుమారుడైనా ఇద్దరు సమానం అన్న ఆలోచనతోనే అమ్మాయిల వివాహ వయస్సును 21ఏళ్లకు పెంచామని, ఇదొక కీలక ముందడుగు అని బుధవారం వర్చువల్‌గా 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన మోదీ అన్నారు. దేశంలో యువ జనాభా అధికంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం, యువజనాభా భారత్‌కు శక్తులని చెప్పారు. దేశ యువతకు ప్రజాస్వామిక స్పృహ, భవిష్యత్‌పై స్పష్టత ఉన్నాయన్నారు. నేడు భారత్‌ చెప్పేది రేపు ప్రపంచ వాణి అవుతుందని మోదీ ఆకాంక్షించారు. శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, కవి సుబ్రమణ్య భారతి తదితరులను యువతకు స్ఫూర్తిప్రదాతలుగా అభివర్ణించారు. ఆయా రంగాల్లో వారు అందించిన తోడ్పాటును కొనియాడారు. స్వాతంత్య్ర సమరంలో యువకులు సర్వం త్యాగంచేశారని చెబుతూ, దేశం కోసం, స్వాతంత్య్ర సమరుల కలల సాకారం కోసం జీవించాలని నేటి యువతరానికి మోదీ పిలుపునిచ్చారు. యువతరం కారణంగానే డిజిటల్‌ చెల్లింపులకు ఆదరణ పెరిగిందని, గ్లోబల్‌ ప్రాస్పరిటీ (అంతర్జాతీయ సుసంపన్నత) కోడ్‌ను భారతీయ యువత లిఖిస్తోందన్నారు. ప్రపంచంలోనే ఏకైక ఎకో సిస్టమ్‌కు చోదకశక్తిగా భారతీయ యువత ఉందన్నారు. భారత్‌లో 50వేలకుపైగా స్టార్టప్‌లు ఉండగా, వాటిలో పదివేలకుపైగా మహమ్మారి వేళ ఏర్పాటయ్యాయని చెప్పారు. పారాలింపిక్స్‌, గతేడాది ఒలింపిక్స్‌లో వచ్చిన పతకాలు యువశక్తికి నిదర్శనమన్నారు. ‘పోటీపడాలి, సాధించాలి’ అన్నది భారత కొత్త మంత్రం కావాలని మోదీ సూచించారు. పాత పద్ధతులను విడనాడి అధునాతన ఆలోచనలు, సామర్థ్యంతో యువత ప్రపంచాన్ని ఏలాలని ఆకాంక్షించారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’,‘ఆత్మనిర్భర్‌’కు పిలుపునిచ్చారు. పొంగల్‌, మకర సంక్రాంతి, బీహు, లోహ్రి పండుగలను పురస్కరించుకొని దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని హితవు పలికారు. అదే సమయంలో రూ.122 కోట్ల పెట్టుబడితో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ టెక్నాలజీ సెంటర్‌నుÑ పుదుచ్చేరి ప్రభత్వం రూ.23కోట్లతో నిర్మించిన ఆడిటోరియం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ‘పెరుంధలైవర్‌ కామరాజర్‌’ మణిమండపాన్ని మోదీ ప్రారంభించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి మాట్లాడుతూ, దేశానికి తోడ్పాటు అందించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని తెలిపారు. ‘సంపద, శాస్త్రీయత, వాణిజ్యం వంటివి కొన్ని ఉదాహరణలు అన్నారు. వ్యక్తిత్వం లేకుండా విద్యÑ సంపద లేకుండా దానం, నైతికత లేకుండా వ్యాపారం, మానవత్వం లేని శాస్త్రీయత నిరుపయోగమే కాదు అత్యంత ప్రమాదకరం కూడా అని నొక్కిచెప్పారు. మహమ్మారి నుంచి యువతను కాపాడటం తమ ధర్మమని, అందుకే ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img