Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

యూపీలో బీజేపీ వ్యతిరేక గాలి

ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌
హర్దోయ్‌(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సోమవారం యోగి పాలనపై వినూత్నరీతిలో విమర్శలు గుప్పించారు. ప్రజల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా 440 వోల్ట్‌ కరెంట్‌ ఉందని స్పష్టం చేశారు. ‘మన సీఎం పీఎంను (యూపీ ఎన్నికల కోసం) పిలిచారు. నగరాల ప్రజలకు పీఎం అంటే ఏమిటో తెలుసు..దీని అర్థం ఆయన ప్యాకర్స్‌ Ê మూవర్స్‌ (పీఎం) సిద్ధంగా ఉన్నారు’ అని హర్దోయ్‌లోని శాండిలా నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి యాదవ్‌ అన్నారు. ఈసారి బీజేపీకి, రాష్ట్ర ప్రజలకు మధ్య ప్రత్యక్ష పోరు ఉందన్నారు. ‘బీజేపీతో ప్రత్యక్షంగా పోరాడుతున్న ప్రజలతో మేం ఉన్నాం. బీఎస్పీ లేదా కాంగ్రెస్‌ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవు. మీ ఓట్లను వృథా చేసుకోకండి, ఎస్పీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చూసుకోండి’ అని ఆయన అన్నారు. ఆదిత్యనాథ్‌ను ‘బుల్డోజర్‌ బాబా’’గా అభివర్ణించిన యాదవ్‌, తాను ఆయనను ‘బాబా సిఎం’ అని పిలిచేవాడినని, అయితే ఒక వార్తాపత్రిక అతనిని ‘బుల్డోజర్‌ బాబా’ గా పేర్కొందని తెలిపారు. గత ఐదేళ్లలో సీఎం పథకాల పేర్లు, రంగులు మార్చేవారని, ఇప్పుడు ఆయన పేరు కూడా మార్చారని అన్నారు. మొదటి, రెండో దశ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సీట్ల పరంగా సెంచరీ కొట్టిందని, మూడు, నాల్గవ దశల తర్వాత తమ పార్టీ ‘డబుల్‌ సెంచరీ’ సాధిస్తుందని, మిగిలిన దశల్లో బీజేపీని మరింత వెనక్కు నెట్టేస్తామని చెప్పారు. ప్రజల్లో తమకు వ్యతిరేకంగా 440 వోల్టుల కరెంట్‌ ఉందని బీజేపీ నాయకులకు అర్థం కావడం లేదని, నేతల భాష మారిపోయిందని, రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బాబాను ఆయన స్వస్థలమైన గోరఖ్‌పూర్‌కు పంపించారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ‘శిక్షామిత్ర’ (తాత్కాలిక ప్రైమరీ టీచర్లు) సమస్యలను పరిష్కరిస్తామన్నారు.ఎస్పీ మిత్రపక్షమైన ఎస్‌బీఎస్పీ అభ్యర్థి సునీల్‌ అర్క్‌వాన్షికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ర్యాలీకి అఖిలేశ్‌తో పాటు వచ్చిన ఎస్‌బీఎస్పీ చీఫ్‌ ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ మాట్లాడుతూ… బీఎస్పీ టికెట్లను బీజేపీ సీనియర్‌ నాయకుడు ఖరారు చేశారని, ప్రజలు తమ ఓట్లను వృథా చేయవద్దని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img