Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రియాంక?

20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
మహిళలకు 8 లక్షలు కేటాయిస్తాం
కొత్త ఉత్తరప్రదేశ్‌ నిర్మాణం మా లక్ష్యం
యూత్‌ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్‌, ప్రియాంక

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంకగాంధీ వాద్రా అనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ప్రియాంకగాంధీ మర్మగర్భంగా తనకుతానే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. యువతను మరింత పటిష్టవంతం చేయడం ద్వారా సరికొత్త ఉత్తరప్రదేశ్‌ను నిర్మించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ ఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందులో 8 లక్షలు మహిళలకే కేటాయిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇన్‌చార్జి ప్రియాంకగాంధీ వాద్రాతో కలిసి రాహుల్‌గాంధీ ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రియాంకగాంధీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని పార్టీ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం ఇతర ప్రతిపక్షాలతో పొత్తుకు మీ పార్టీ అంగీకరిస్తుందా? అదేసమయంలో మీరు ప్రకటించిన మేనిఫెస్టోను ఆ పార్టీలు అంగీకరించకపోతే ఏమి చేస్తారు? అని విలేకరులు ప్రశ్నించగా అలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రియాంకగాంధీ చెప్పారు. తమ మేనిఫెస్టో అంశాలను కూడా ఆ పార్టీలతో చర్చిస్తామని తెలిపారు. తాము ఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ యువత, మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహం ఏమిటని ప్రశ్నించగా ‘కాంగ్రెస్‌ నుంచి యూపీలో మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? మరి ఎందుకు అడుగుతున్నారు?’ అని ప్రియాంక విలేకరులను ఎదురు ప్రశ్నించారు. సీఎం అభ్యర్థి ఎవరని విలేకరులు పదేపదే అడుగగా ‘ఎక్కడ చూసినా నా ముఖం తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా’ అని ఆమె అన్నారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ తాము ప్రకటించిన మేనిఫెస్టో ఒక విజన్‌ డాక్యుమెంట్‌ అన్నారు. ఇందులో బూటకపు హామీలేవీ ఉండవని చెప్పారు. మేనిఫెస్టో తయారు చేయడానికి ముందే యువతతో విస్తృతంగా చర్చించామని, యువత అభిప్రాయాలు, ఆకాంక్షలు ఎన్నికల ప్రణాళికలో ప్రతిబింబిస్తున్నాయని రాహుల్‌ అన్నారు. ‘ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడి యువతకు సరికొత్త విజన్‌ అందించాల్సిన అవసరం ఉంది. ఆ విజన్‌ను కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఇవ్వగలదు. మేము విద్వేషాలు వ్యాప్తి చేయడం లేదు. ప్రజలందరినీ ఐక్యం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. యువతను విశ్వాసంలోకి తీసుకోవడం, పటిష్టవంతం చేయడం ద్వారా సరికొత్త ఉత్తరప్రదేశ్‌ను నిర్మించాలని మేము కోరుకుంటున్నాం’ అని రాహుల్‌గాంధీ చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిందని, యువత నిరాశలో ఉన్నారని ప్రియాంకగాంధీ అన్నారు. యువత, మహిళలు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నది. అందులో భాగంగా మహిళలకు 40శాతం టికెట్లు ప్రకటించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్లు లెక్కింపు ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img