Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాంకోపై రైతుల గరంగరం

ఉద్యోగాల్లేవ్‌… ఉపాధి లేదు
ఉద్యమానికి అన్నదాతలు రెడీ
రాజకీయ పార్టీలు, రైతు సంఘాల మద్దతు

కొలిమిగుండ్ల : రాంకో సిమెంట్‌ పరిశ్రమ యాజమాన్యం తీరుపై రైతులు మండిపడుతున్నారు. పరిశ్రమ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన రైతులు రాంకోకు విలువైన భూములు అప్పగించారు. రైతు ఆశలను యాజమాన్యం అడియాశలు చేసింది. బాధిత రైతు కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగాలు, సాగుపై చుక్కలు చూపిస్తోంది. దీంతో బాధిత రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రైతు సంఘాలు ఆయా పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరాయి. అఖిలపక్షం ద్వారా సమస్యల పరిష్కారానికి పోరాటంలోకి దూకేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కొలిమిగుండ్ల, నాయనపల్లి, పేట్నీకోట, కల్వటాల, కనకాద్రిపల్లి, ఇటిక్యాల, చింతలాయపల్లి గ్రామాల రైతులు రాంకో కంపెనీకి 15 ఏళ్ల కిందట అతి తక్కువ ధరకు భూములు విక్రయించారు. పరిశ్రమను ఏర్పాటు చేసి…నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు ఇస్తామని నాడు రాంకో యాజమాన్యం హామీ ఇచ్చింది. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసినప్పటికి పరిశ్రమ ఏర్పాటులో జాప్యం జరిగింది. రెండేళ్ల కిందట కల్వటాల పరిధిలో నిర్మాణ పనులు మొదలు పెట్టింది. నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకుంటున్నప్పటికీ బాధిత రైతు కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా మభ్య పెడుతోంది. ఏడు గ్రామాల బాధిత రైతు కుటుంబాల్లో ఐటీఐ, పాలిటెక్నికల్‌, బీటెక్‌ తదితర విద్యనభ్యసించిన యువత ఉద్యోగాల కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నది. కానీ యాజమాన్యం నుంచి ఉలుకు, పలుకు కనిపించడం లేదు. ఇటిక్యాల, చింతలాయపల్లి రైతులు రాంకో భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీనిని యజమాన్యం అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదు.
భూములు సైతం సాగు చేయనీయడం లేదు. ఇక తామెలా బతకాలని రైతులు నిలదీస్తున్నారు. రాంకో కోసం ఉన్న భూమంతా త్యాగం చేస్తే యాజమాన్యం కట్టుబట్టలతో నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమాన్యం తీరుపై ఆయా పార్టీలు, రైతుసంఘాల నాయకులు, బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పంటలు సాగు చేసుకునేందుకు రెండు గ్రామాల రైతులకు అనుమతిచ్చేంత వరకూ పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img