Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాంకో.. వెళ్లమంటోంది

ఉపాధి కల్పించకుండా సాగుకు అడ్డు
రెండు గ్రామాల రైతులకు కష్టాలు
పరిశ్రమకు భూములిచ్చిన రైతుల ఆవేదన

విశాలాంధ్ర-కొలిమిగుండ్ల :
రాంకో సిమెంట్‌ పరిశ్రమకు భూములిచ్చిన రైతుల్లో ఆందోళన, ఆవేదన తీవ్రమవుతోంది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో సిమెంట్‌ పరిశ్రమ నిర్మాణ సమయంలో రైతు కుటుంబాలకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు. అదేసమయంలో రైతుల సాగుకు యాజమాన్యం అనుమతించడం లేదు. అటు ఉపాధి కల్పించక..ఇటు సాగుకు అవకాశం ఇవ్వకపోవడంతో తమ కుటుంబాల పరిస్థితి ఏమిటంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పరిశ్రమ వస్తే తమ కుటుంబాలు పచ్చగా ఉంటాయని భావించిన అన్నదాత ఆశలు అడియాశలవుతున్నాయి. పరిశ్రమల కారణంగా గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యే అవకాశం మరెంతోకాలం లేదు. వ్యవసాయం లేక ఎలా బతకాలో తెలియడం లేదు. వ్యవసాయం లేకపోతేవలసలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూములు కోల్పోయిన రైతులు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో జీవిస్తున్నారు. ఆధారమే కోల్పోయిన రైతులకు ఏ దారి కనిపించడం లేదు. మండలంలోని కొలిమిగుండ్ల, నాయునిపల్లి, పెట్నికోట, కల్వటాల, ఇటిక్యాల, చింతలా యపల్లి, కనకాద్రిపల్లి గ్రామాల్లో సాగు భూములను రైతుల నుంచి రాంకో సిమెంట్‌ యాజమాన్యం 15 ఏళ్ల నుంచి దశలవారీగా కొనుగోలు చేస్తోంది. 2006లో ఎకరం రూ.76 వేలతో కొనుగోలు ప్రారంభించిన సంస్థ ఇప్పటికీ కొనసాగిస్తోంది. రైతుల కష్టాలు, అప్పులు, అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని వేలాది ఎకరాల పంట భూములను యజమాన్యం తక్కువ ధరకే కొనుగోలు చేసింది. త్వరతగతిన పరిశ్రమను స్థాపించి భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వనప్పటికీ అన్నదాతలు ఎంతో నమ్మకంతో సారవం తమైన భూములు విక్రయించారు. రాంకీ యాజమాన్యం ఆనాడు పరిశ్రమను ఏర్పాటు చేయకపోవడంతో ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. 15 ఏళ్ల తర్వాత కల్వటాల గ్రామ పరిధిలో రెండేళ్ల నుంచి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించింది. కరోనాతో సిమెంట్‌ ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది నుంచి రైతులు సాగు చేయవద్దంటూ యాజమాన్యం వేసవిలోనే దండోరా వేయించింది. అప్పటి నుంచి రైతుల్లో అలజడి మొదలైంది. పరిశ్రమలో ఉపాధి కల్పించకుండానే సాగు చేయవద్దం టూ రాంకో చెప్పడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించిన తర్వాత సాగు చేయొద్దంటే బాగుంటుందని రైతులు అంటున్నారు. ఏడు గ్రామాలకుగాను ఐదు గ్రామాల రైతులకు పరోక్షంగా సాగుకు అనుమతించి చింతలాయపల్లి, ఇటిక్యాల గ్రామాల పరిధిలోని రైతులకు అనుమతివ్వకపోవడం ఏమిటని ఆ రెండు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు గ్రామాల సమీపంలో చేపట్టబోయే మైనింగ్‌ క్వారీ పనులకు దూరంగా ఉన్న భూముల్లో పంటల సాగుకు అనుమతించాలని రైతులు కోరుతున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతే మైనింగ్‌ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి గురించి ప్రశ్నించే రైతు కుటుంబాలపై పోలీసుల ద్వారా యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img