Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాజకీయ కక్షతో చేస్తున్న పోలీసు
దాడులు, కూల్చివేతలు ఆపాలి

సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాజకీయ కక్షతో చేస్తున్న పోలీసు దాడులు, ఇళ్ల కూల్చివేతలను నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో రోజురోజుకీ పోలీసుల దాష్టీకం పెరిగిపోతోందనీ, వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలకు మడుగులొత్తుతూ ప్రజా ఉద్యమాలను, శాంతియుత నిరసనలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపైన పోలీసుల నిర్భంధాలు, దాడులు, ఇళ్లు కూల్చివేస్తున్నారని పేర్కొంది. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు, దాడులు, అరెస్టుల వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనీ చట్ట ప్రకారం అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం చేయవచ్చుగానీ అర్ధరాత్రివేళ గోడలు దూకి, తలుపులు బద్ధలుకొట్టి ఉన్నపళంగా అరెస్టులు చేయడం సరైందికాదని పేర్కొంది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుని అడ్డగోలుగా అర్ధరాత్రి వేళ టెర్రరిస్టులను పట్టుకున్నట్లు అరెస్టు చేసిన తీరును సీపీఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిరచింది. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం శనివారం ముగిసింది. పి.దుర్గాభవాని అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, చేపట్టవలసిన ప్రజా ఉద్యమాలను గురించి వివరించారు. అనంతరం సమావేశం ఈ దిగువ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ సభకు స్థలమిచ్చి తోడ్పడ్డారనే మిషతో విశాలమైనరోడ్డు ఉన్నప్పటికీ రోడ్డు విస్తరణ పేరుతో రెండువైపులా ఇళ్లను కూల్చివేయడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఇళ్లు కూల్చివేతలు తక్షణమే విరమించాలి. ప్రజాసంఘాలు వారి వారి సమస్యలపై చేస్తున్న న్యాయ సమ్మతమైన ఆందోళనలకు అనుమతులు ఇవ్వకపోవడమేకాక ముందస్తు అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఆక్రమణలకు డబ్బు కట్టించుకుని రెగ్యులరైజ్‌ చేస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు రాజకీయ కక్షసాధింపుగా ప్రతిపక్షాల ఇళ్లను కూల్చడం దుర్మార్గం. దళితులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూముల విషయంలో కూడా రాజకీయ వివక్షతతో తొలగించడం మానుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది. రాష్ట్రంలో ఇలాంటి ఉన్మాదపూరిత చర్యలను భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందని సమావేశం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img