Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

వైరస్‌ తగ్గుముఖంతో ప్రభుత్వం నిర్ణయం
కోవిడ్‌ మార్గదర్శకాల అమలు యధాతథం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో రెండు నెలలుగా కొనసాగుతున్న రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితు లపై సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. కోవిడ్‌ పరిస్థితులను, వాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అన్ని జిల్లాల్లో కోవిడ్‌ విస్తరణ గణనీయంగా తగ్గిందని, 0.82 శాతానికి కోవిడ్‌ యాక్టివిటీ కేసుల రేటు పడిపోయిందని తెలిపారు. గతవారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇప్పుడు 18,929కి పడిపో యాయని వివరించారు. గత సమావేశం నాటికి రోజువారీ పాజిటివిటీ రేటు 17.07శాతం కాగా, ప్రస్తుతం 3.29 శాతంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,581 సచివాలయాల్లో కేసులు లేవని తెలిపారు. దీంతో ఇకపై రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ కోవిడ్‌ మార్గదర్శకాలు యధాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, మరోపక్క ఫీవర్‌ సర్వే కొనసాగిస్తూ.. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. వాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగాలన్న సీఎం…రాష్ట్రంలో ఇప్పటివరకు 3,90,83,148 మందికి రెండు డోసుల వాక్సినేషన్‌ పూర్తి చేశామని, 45 ఏళ్లు పైబడిన వారిలో 96.7శాతం, 1844 ఏళ్ల మధ్య వారిలో 90.07శాతం, 1518 ఏళ్ల వయస్సువారికి 24.41శాతం పూర్తి చేసినట్లు వెల్లడిరచారు. మిగిలినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆస్పత్రుల్లో పరిపాలన, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సీఎం సూచించారు.గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహ కాలు ఇవ్వాలన్నారు. సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, వైద్య ఆరోగ్యశాఖముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌, వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఏంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img