Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్ర మంత్రులు డమ్మీలా?

దిగజారిన ఆర్థిక పరిస్థితి
19 రాజకీయ పార్టీలతో కలిసి 25న భారత్‌ బంద్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అనంతపురం : కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై 19 రాజకీయ పార్టీలతో కలసి 25న భారత్‌బంద్‌ నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర మంత్రులు డమ్మీలుగా మారిపోయారని, సీఎం ప్రసన్న కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. అనంతపురం సీపీిఐ కార్యాలయంలో బుధవారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ సంస్థలకు మోదీ సర్కారు దోచిపెడుతోందని విమర్శించారు. మోదీ హయాంలో మతోన్మాదం పెచ్చరిల్లిందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోదీ సర్కారు వివాదాస్పద చట్టాలు తెచ్చిందన్నారు. పది మాసాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న జలవివాదం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదన్నారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ 2015లోనే ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఆ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తిరుగుబాటు చేయడం దుర్మార్గమన్నారు. జల వివాదాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం గజన్‌ను డిమాండు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కృష్ణా బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండు చేశారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా ఉందని రామకృష్ణ చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. మంత్రులు బానిసలుగా మారారని, ముఖ్యమంత్రి ఆశీసుల కోసం ఆయనను పొడిగేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మంత్రి గౌతంరెడ్డి మాట్లాడటం విచారకరమన్నారు. సీనియర్‌ మంత్రి బొత్సా సత్యనారాయణ సైతం విశాఖే రాజధాని అని, కోర్టు అందుకు అనుమతిస్తుందని చెప్పడం దేనికి సంకేతమని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలన, ప్రజల స్థితిగతులను ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం సీఎంను పొగడటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 25న జరిగే భారత్‌బంద్‌ను అన్నిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని కోరారు.
పంచాయతీలకే స్థానిక సంస్థల నిధులు : జగదీష్‌
స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులు నేరుగా సర్పంచ్‌ల ఖాతాలకే జమచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి జగదీష్‌ డిమాండు చేశారు. రాజ్యాంగం కల్పించిన 73,74 సవరణ చట్టాలను అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నిధికి జమచేస్తే పంచాయతీలకు ఒక్క రూపాయ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి లేదని, దీనికీ ఇందిరమ్మ ఇళ్ల గతే పడుతుందన్నారు. 1.82 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవాలంటే లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. ఇసుక కొరత, గృహనిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వల్ల జగనన్న ఇంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం 5 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, కార్యదర్శి వర్గసభ్యులు వేమయ్య యాదవ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, సీపీిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి రమణయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img