Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాహుల్‌కు రెండేళ్ల జైలు

. బెయిల్‌ మంజూరు
. హైకోర్టులో అప్పీలుకు 30 రోజుల గడువు

సూరత్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుజరాత్‌, సూరత్‌ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. 2019లోని పరువు నష్టం దావాకు సంబంధించి ఈ శిక్షను విధించింది. దొంగల దొంగలందరి ఇంటిపేరు ‘మోదీ’ ఏమిటంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ హెచ్‌హెచ్‌ వర్మ ఈ మేరకు రాహుల్‌కు శిక్ష విధించారు. ఐపీసీలోని 499, 500 సెక్షన్ల కింద రాహుల్‌ను దోషిగా నిర్థారించింది. అయితే ఆయనకు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. 30 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పటివరకు శిక్షను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు వివరాలను రాహుల్‌ న్యాయవాది బాబు మంగుకియా తెలిపారు. ఇదిలావుంటే ‘నిందితుడు పార్లమెంటు సభ్యుడు. ఆయన మాట్లాడే మాటల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. అది ఈ నేరం తీవ్రతను పెంచుతుంది. దోషికి తక్కువ శిక్ష విధిస్తే ఎవరైనా ఎవరినీ అవమానించవచ్చు అన్న తప్పుడు సందేశం సమాజంలోకి వెళుతుంది.‘చౌకిదార్‌ చోర్‌ హై’ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన ఆయనను భవిష్యత్‌లో ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు కూడా సూచించింది. ఆయన తన తీరును మార్చుకోలేదు’ అని కోర్టు తీర్పు పేర్కొంది. అంతకుముందు విచారణ క్రమంలో రాహుల్‌ గాంధీ కోర్టులో మాట్లాడుతూ తనకు ప్రజలంతా సమానమని, ఎవరిపై వివక్ష లేదని, అందరు పౌరులను ప్రేమిస్తానని చెప్పారు. ప్రజా హితవు క్రమంలో ప్రసంగించానన్నారు. రాహుల్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాయన మాటల్లో ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదిదారుడికి ఎటువంటి నష్టంగానీ బాధగానీ కలగలేదని. గతంలో ఏ నేరంలోనూ దోషిగా రుజువు కాలేదని, ఎవరి నుంచి మాఫీకానీ క్షమాభిక్ష కోసం అర్థించలేదని వాదించారు. ప్రాసిక్యూషన్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఆయన గతంలో సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారని, భవిష్యత్‌లో ఇలా జరగకూడదని సుప్రీం కోర్టు ఆయనకు హితవు పలికిందని గుర్తుచేశారు. అయినా ఆయన తీరు మారకపోవడంతో సమాజానికి తప్పుడు సందేశం వెళుతుందన్నారు. రెండేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. అయితే ప్రజా ప్రతినిధుల చట్టం,1951 ప్రకారం ఇందుకు మూడు నెలలు పడుతుంది. ఈలోగా సంబంధిత వ్యక్తికి శిక్షపై స్టే లభిస్తే కేసు విచారణ ముగిసేంత వరకు అనర్హత విషయంలోనూ చర్యలు తీసుకోరు అని సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీ అన్నారు. ‘దోషిగా రుజువై రెండేళ్ల శిక్ష పడితే అప్పుడు అనర్హతకు అవకాశం ఉంటుంది. అయితే అది వెంటనే జరిగిపోదు. అందుకు మూడు నెలలు పడుతుంది. ఆ లోగా శిక్ష రద్దు అయిత అనర్హత వర్తించదు’ అని వెల్లడిరచారు. ఇలా చేయగలినది అప్పిలేట్‌ కోర్టు మాత్రమేనని శిక్ష విధించిన కోర్టు కాదని కూడా ఆయన చెప్పారు. అప్పిలేట్‌ కోర్టు రాహుల్‌ శిక్షను రద్దు చేయొచ్చన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img