Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాహుల్‌గాంధీ నైట్‌క్లబ్‌ వీడియోపై రచ్చ..దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు

కాంగ్రెస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయనతోపాటు నేపాల్‌లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో కొందరు బీజేపీ నేతలు ఈ వీడియోను తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేస్తూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. ఈ వీడియోలో ఉన్నది కాఠమాండూలోని ఓ పాపులర్‌ నైట్‌క్లబ్‌ అని తెలుస్తోంది. తన జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ సోమవారం నేపాల్‌ వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడిరచాయి. బీజేపీ ఐటీ కన్వీనర్‌ అమిత్‌ మాల్వియా పోస్టు చేస్తూ..కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉంటే రాహుల్‌ విదేశాల్లో నైట్‌క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజస్థాన్‌లో మతఘర్షణలు చోటుచేసుకుంటుంటే రాహుల్‌ మాత్రం పార్టీల్లో ఉన్నారు. ఈయన కనీసం పార్ట్‌ టైం రాజకీయనాయకుడు కాదు. ‘పార్టీ టైం పొలిటీషియన్‌’ అని మరో బీజేపీ నేత దుయ్యబట్టారు.
అయితే ఈ వీడియో వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. వివాహ వేడుకకు రాహుల్‌ వెళ్లడం నేరమా? అని ఆ పార్టీనేత రణదీప్‌ సూర్జెవాలా ప్రశ్నించారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజుకు పిలవకుండా ప్రధాని మోదీ వెళ్లినట్టు.. రాహుల్‌ గాంధీ వెళ్ళలేదుగా అని అన్నారు. ఆహ్వానిస్తేనే రాహుల్‌ వివాహ వేడుకకు వెళ్లారని వివరించారు. ఫ్రెండ్‌ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన ఖాట్మండ్‌ వెళ్లారని చెప్పారు. రాహుల్‌ వ్యక్తిగత టూర్‌లో ఉన్నారు. ఇందులో తప్పేముందో చెప్పాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు. విద్యుత్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కానీ వారి సమయమంతా రాహుల్‌ కోసమే కేటాయిస్తారని మండిపడ్డారు. గాంధీ కుటంబానికి చెందిన వ్యక్తి సాధారణ వ్యక్తిలా ఓ పెళ్లి రిసెప్షన్‌కు హాజరైతే తప్పేంటో చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మండిపడ్డారు. ఏం తప్పు జరిగిందో దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. కారణం లేకుండా కాంగ్రెస్‌ నాయకుడిని విమర్శించడానికి బదులు ముఖ్యమైన సమస్యలపై దృష్టిసారించాలని హితబోధ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img