Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రుద్రాక్ష గుట్ట బాధితులకు ఇళ్ల పట్టాల కోసం
సీపీఐ భారీ ర్యాలీ

విశాలాంధ్ర-డోన్‌: నంద్యాల జిల్లాలో రుద్రాక్షగుట్ట బాధితుల కోసం సీపీఐ భారీ ఆందోళన చేపట్టింది. తమను అడుగడుగునా మోసగిస్తున్న పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడిరది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తడాఖా చేపిస్తామని హెచ్చరించింది. రుద్రాక్ష గుట్ట బాధితులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో సోమవారం సీపీఐ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు వందలాది మంది లబ్ధిదారులతో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ బెదిరింపులకు… తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి బి.నారాయణ అధ్యక్షతన జరిగిన ముట్టడి కార్యక్రమానికి రామాంజనేయులు సహా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సుంకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి పులి శేఖర్‌ హాజరయ్యారు. పేదలకు పట్టాలివ్వాలని 2007 నుంచి పోరాటం చేస్తున్నట్లు రామాంజనేయులు చెప్పారు. 2007లో రుద్రాక్షగుట్టలో పేద ప్రజలు సీపీఐ అధ్వర్యంలో 750 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. అప్పటి ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేతుల మీదుగా కొంతమందికి పట్టాలు ఇప్పించారన్నారు. సుజాతమ్మ ఓటమిచెందిన తర్వాత డోన్‌లో కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఆయన కూడా పేదలను పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పట్టాలిస్తామని ప్రస్తుతం ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు అభివృద్ధి మాటున పేదలు నిర్మించుకున్న ఇళ్ల స్థలాల దగ్గర 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, ఇందుకు సీపీఐ మద్దతివ్వాలని అభ్యర్థించారని రామాంజనేయులు వివరించారు. అంతేకాకుండా ఆ స్థలంలో ఇళ్లు కోల్పోయిన వారికి పక్కన ఇంటి పట్టాతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, దీనిని నమ్మి సీపీఐ అంగీకరించిందన్నారు. మాటతప్పిన మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి… రెవెన్యూ అధికారులు, పోలీసులతో 100 పడకల ఆసుపత్రి పక్కనే రెసిడెన్షియల్‌ పాఠశాల, నర్సింగ్‌ కళాశాల నిర్మించడానికి పేదలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చారన్నారు. దీంతో లక్షల రూపాయలను పేదలు నష్టపోయారన్నారు. అడ్డుకున్న సీపీఐ నాయకులపై కేసులు బనాయించారన్నారు. మాటతప్పిన మంత్రి బుగ్గనకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వైసీపీ కార్యాలయంలో అభివృద్ధి మాటున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మంత్రి బుగ్గనను ఓడిరచడానికి పట్టణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. రుద్రాక్ష గుట్ట లబ్ధిదారులకు న్యాయం చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అవసరమైతే సీపీఐ అధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేశ్‌, సీపీఐ మండల సహాయ కార్యదర్శి వరదరాజు, హుస్సేన్‌ పీరా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, సర్పంచ్‌ జె.రవిమోహన్‌, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు అబ్బాస్‌, పుల్లయ్య, సీపీఐ జిల్లా సమితి సభ్యులు ప్రభాకర్‌, గౌండ భాష, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు చిన్న రంగన్న, నారాయణ, రామకృష్ణ, సురేశ్‌, సుంకన్న, సుధాకర్‌, అన్వర్‌, వెంకటేశ్‌, విజయ్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img