Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతాంగ పోరాటమే దేశానికి రక్ష

. భాషలు వేరైనా అందరి భావాలూ ఒక్కటే
. భవిష్యత్‌లో మరో బలమైన ఉద్యమం
. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాల పురిటిగడ్డ
. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి
. సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు రాకేశ్‌ తికైత్‌
. రైతుగర్జన సదస్సులో కీలక ప్రసంగం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రైతాంగ ఉద్యమమే దేశానికి కీలకమని, వారి పోరాటంతో దేశానికి ఎంతో మనుగడ ఉందని, మోదీ ప్రభుత్వ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు రాకేశ్‌ తికైత్‌ వెల్లడిరచారు. మార్చి 20న దిల్లీ కేంద్రంగా జరగబోయే రైతాంగ ఉద్యమంలో దేశ వ్యాప్తంగా రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం, విద్యుత్‌ బిల్లు-2022 రద్దు తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో ‘రైతు గెలవాలివ్యవసాయం నిలవాలి’ అంశంపై రాష్ట్ర స్థాయి రైతుగర్జన సదస్సు నిర్వహించింది. సదస్సుకు వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా రాకేశ్‌ తికైత్‌, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్‌ గౌడ్‌తో పాటు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. రాకేశ్‌ తికైత్‌ మాట్లాడుతూ భాషతో సంబంధం లేకుండా మన భావాల్ని పంచుకోవాలన్నారు. అందరి బాధలూ, భావాలూ ఒక్కటేనని నొక్కి చెప్పారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య దాగి వుందని, అది రైతుల ఎరువుల దగ్గర నుంచి వారి జీవనస్థితి వరకు చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాల పురిటిగడ్డ అని, దిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక ఉద్యమానికి ఇక్కడి రైతాంగ ఉద్యమాలు స్ఫూర్తిదాయకమంటూ తికైత్‌ కొనియాడారు. కశ్మీర్‌లోని యాపిల్‌ రైతుల సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు గిట్టుబాటు ధర వరకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనంతటికీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విధానాలేనని మండిపడ్డారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం ఏర్పాటు చేసిన స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనలు అమలు కోసం రైతాంగం మరో పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. బీహార్‌లోని రైతుల భూములపై కార్పొరేట్‌లు, బడా బాబులు కన్నేశారని, వారి ఆగడాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాలన్నారు. రైతాంగాన్ని అణచివేసే ధోరణితో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాబోయే 10 ఏళ్లలో రైతాంగానికి చెందిన డీజిల్‌ ఇంజన్లు, వాహనాలను రద్దు చేసే పరిస్థితి ఉందని, వాటిపైనా ఆందోళనలు చేయాలని చెప్పారు. రైతు బతకాలంటే రైతు ఉద్యమం తప్పనిసరి అని, ఆ దిశగా అందరూ సంసిద్ధం కావాలని ఆయన పునరుద్ఘాటించారు.
రైతు శక్తి ఐక్యం కావాలి: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్‌ గౌడ్‌
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్‌ గౌడ్‌ మాట్లాడుతూ 140 కోట్ల మందికి అన్నంపెట్టే రైతుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, కేంద్ర బడ్జెట్‌లో రైతాంగానికి కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతంలో 67 శాతం ఉన్న రైతుల జీవనస్థితి, ఆర్థిక పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని, వారికి సరైన ఇళ్ల నుంచి ప్రాథమిక వసతుల కల్పన దూరంగా ఉన్నాయని, వారికి మనుగడ కరవైందని వివరించారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలను కార్పొరేట్‌లకు అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం ఆయా రంగాలను నీరుగారు స్తోందన్నారు. నాడు కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేసిన ఉద్యమంతో మోదీ దిగివచ్చారని, దానికి కారణం రైతుల మధ్య ఐక్యతేనని నొక్కి చెప్పారు. ఆ ఐక్యతతోనే కేంద్రం చేసిన చట్టాలను పార్లమెంటు సాక్షిగా ఉపసంహరించుకుంటున్నట్లు మోదీ ప్రకటించారని గుర్తుచేశారు. ఇదే విధానం దేశ వ్యాప్తంగా అమలు కావాలని, పార్టీలకు అతీతంగా రైతులు సంఘ టితమై… వారి కోర్కెల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోదీ పాలన పూర్తిగా కార్పొరేట్ల మయంగా మారిందని, దీనిని వివరిస్తూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్రాసిన పుస్తకం ఎంతో మంచిగా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన వడ్డే శోభనాద్రీశ్వర రావు మాట్లాడుతూ ఎవరి పార్టీ వారిదేనని, రైతాంగ సమస్యలపై పార్టీల నాయకత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. నాటి బ్రిటీష్‌ పాలనకు మించిన దౌర్భాగ్యం దేశంలో కనిపిస్తోందని విమర్శించారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌… అది అమృతకాల బడ్జెట్‌ కాదని, కార్పొరేట్‌లు, బడాబాబుల బడ్జెట్‌ అని విమర్శించారు. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతులకు కేవలం లక్షా 45 వేల కోట్లు కేటాయించడం దుర్మార్గమని, ఇది రైతులపై కేంద్రం చూపిస్తున్న వివక్షేనని మండిపడ్డారు. నాటి దిల్లీ కేంద్రంగా జరిగిన చారిత్రాత్మకమైన రైతుల ఉద్యమంతో మోదీ వెన్నులో వణుకు వచ్చి పార్లమెంటు సాక్షిగా వాటిని ఉపసంహరించుకున్నారని గుర్తుచేస్తూ… దానిని మనస్సులో పెట్టుకుని రైతాంగానికి నిధులు కేటాయించకుండా పరోక్షంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. డిజిటలైజేషన్‌ పేరుతో అమెజాన్‌, ఐటీసీ కంపెనీలకే కేంద్రం పెత్తనం ఇస్తోందని, దీనివల్ల రైతులకు ఒరిగేదేముందని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర సీఎం జగన్‌ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. వాటికి వ్యతిరేకంగా మార్చి 20న చలో దిల్లీ, అదే రోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చామన్నారు. ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ మోదీ ఒక్క రైతులకే కాదని, అన్నింటా దగా చేశారంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మాట్లాడితే చాలు… రాముడి పాలన అంటారని, నాడు తిరుపతి కేంద్రంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి అమలు చేయలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ హామీని మోదీ నిలబెట్టకోలేక పోయారని ధ్వజమెత్తారు. మోదీ పాలన అంటే… అంబానీ, అదానీ, కార్పొరేట్‌ వర్గాలు అని అర్థం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ రైతులు ఐక్యంగా ఉంటేనే వారితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతులు కలిసి వస్తారన్నారు. అదానీ, అంబానీకి మోదీ, జగన్‌ పూర్తిగా కొమ్ము కాస్తున్నారని, వారికి చాలా అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల జీడీపీ ఉన్న వ్యవసాయ రంగంపై అదానీ కన్నుపడిరదని, దీంతో వ్యవసాయ దారులు, రైతుల మధ్య పోటీ పెట్టే విధానాలకు కేంద్రం తెరదీస్తోందన్నారు. మాజీ ఎంపీ పి.మధు మాట్లాడుతూ రైతాంగ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకుగాను ఈ రైతు గర్జన దోహదపడుతుందన్నారు. చలో దిల్లీకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీకేఎంయూ అధ్యక్షులు రాజ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మోదీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ దుష్ట విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల డిమాండ్లను ఆమోదించి, వారి ఎన్నికల ప్రణాళికలో అమలు చేస్తామనే హామీ ఇచ్చిన రాజకీయ పక్షాలకే రైతాంగం, కౌలు రౌతులు, వ్యవసాయ కార్మికులు మద్దతు ఇవ్వాలని సదస్సు తీర్మానించింది. తొలుత మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘కార్పొరేట్లకే తప్ప సామాన్యులకు మేలు చేయని మోదీ పాలన’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. రాకేశ్‌ తికైత్‌, రాజ్‌వీర్‌ సింగ్‌… హిందీలో చేసిన ప్రసంగాలను సీనియర్‌ జర్నలిస్ట్‌ షఫీ అహ్మద్‌ తెలుగులో అనువందించారు. తొలుత వక్తలను వేదిక పైకి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ స్వాగతం పలికారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పి.జమలయ్య వందన సమర్పణ చేశారు. ఈ సదస్సులో రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్‌, ఏపీ రైతు సంఘం నాయకులు ఎం.యలమందరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, తెలుగు రైతు నాయకులు రాజేశ్వరరావు, రాజశేఖర్‌రెడ్డి, నరేంద్ర, రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు కొల్లా రాజమోహన్‌, సింహాద్రి రaాన్సీ, ఎం.ప్రసాద్‌, పి.హరినాథ్‌, జి.బాలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, ఆర్‌.పిచ్చయ్య రైతాంగ స్థితిగతులపై గీతాలను ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img