Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రైతుకు దెబ్బ

మార్కెట్‌ ధర కంటే 30 శాతం తక్కువ ప్రకటించటం దారుణం

. క్వింటాలుకు ఎంఎస్‌పీ రూ.6,380
. మార్కెట్‌ ధర రూ.10 వేలు పైనే !
. 34 సీసీఐ కేంద్రాల్లో 1నుంచి కొనుగోళ్లు
. 51 జిన్నింగ్‌ మిల్లుల్లోనూ సేకరణ
. అశనిపాతంలా ప్రభుత్వ చర్యలు
. ధరలు పడిపోతాయని రైతుల్లో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో నవంబరు 1వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా 34 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవిగాక 51 జిన్నింగ్‌ మిల్లుల్లోనూ విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ… పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా మార్కెట్‌ ధర పడిపోకుండా ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర రైతుల వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు అయ్యేలా దోహదపడాలి. కానీ మార్కెట్‌ ధర కంటే మద్దతు ధర తక్కువగా ఉంటే దళారులు, వ్యాపారులు సిండికేటై రైతులను నిలువు దోపిడీ చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌కు సంబంధించి పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొడుగు పింజ పత్తి కనీస మద్దతు ధరను రూ.6,380గా, మధ్యస్థ రకానికి రూ.6,280గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి పత్తికి ఈ ఏడాది మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మార్కెట్‌ ధర ప్రస్తుతం క్వింటా రూ.9,500 నుంచి రూ.10వేల పైనే ధర పలుకుతోంది. వ్యాపారస్తులు నేరుగా క్షేత్రస్థాయిలోనే రైతుల నుంచి పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి నవంబరు 1వ తేదీ నుంచి సీసీఐ ద్వారా కొనుగోలుకు చేస్తున్న హడావుడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దాదాపు 16.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టగా, 20లక్షల టన్నులకు పైగా పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, కనీసం ఈ ఏడాదైనా అప్పులు తీరతాయని రైతులు ఆశపడుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు సీసీఐ లాంటి సంస్థలు రంగంలోకి దిగి మద్దతు ధరతో కొనుగోలు చేయాలి తప్ప మార్కెట్‌ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పుడు వాటికంటే తక్కువ ధరలు ప్రకటించి…దళారులు, వ్యాపారులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడం సరికాదని రైతు నేతలు విమర్శిస్తున్నారు. మార్కెట్‌ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పుడు రకరకాల ఆంక్షలు, నిబంధనలతో మార్గదర్శకాలు విడుదల చేసి ప్రభుత్వం అతి తక్కువ మద్దతు ధర ప్రకటించడం వల్ల రైతుకు ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పంట సాగుకు పెట్టుబడులు గణనీయంగా పెరిగినందున వాస్తవ పరిస్థితులకనుగుణంగా పత్తి మద్దతు ధరను పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
సీసీఐ నిబంధనలివే:
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లకు సీసీఐ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దాని ప్రకారం పత్తిలో తేమ 8శాతం, అంతకంటే తక్కువ ఉండాలి. తేమ శాతం పెరిగిన ప్రతి ఒక్క శాతానికి మద్దతు ధరలో ఒక శాతం చొప్పున కోత పెడతారు. మైక్రోనైర్‌ విలువ (బన్నీ/బ్రహ్మ3.54.3, ఎంఈసీహెచ్‌ 3.54.7) నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాలుకు రూ.25 తగ్గిస్తారు. ఆధార్‌ అనుసంధానమైన రైతు బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img