Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతులకు ఆ ఉద్దేశమే లేదు..

ప్రధాని పర్యటనను అడ్డుకున్న ఆరోపణపై ఎస్‌కేఎం
న్యూదిల్లీ : ప్రధానమంత్రి పంజాబ్‌ పర్యటనను అడ్డుకొనే ఆలోచన రైతులకు లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఈనెల 5న ప్రధానమంత్రి పంజాబ్‌ పర్యటనను పురస్కరించుకొని కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తేని అరెస్టుకు డిమాండు చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా అనుబంధ 10 రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇందుకు 2వ తేదీన పిలుపునివ్వగా 5న పంజాబ్‌ వ్యాప్తంగా జిల్లా, మండలం, గ్రామ స్థాయిలోనూ ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలను చేపట్టాలని రైతులు భావించారేగానీ ప్రధాని పర్యటనను అడ్డుకోవాలనిగానీ ఆపేయాలనిగానీ కాదని ఎస్‌కేఎం పేర్కొంది. ఇచ్చిన పిలుపు మేరకు 5న శాంతియుతంగా ఆందోళనలు జరిగాయి. ఫిరోజ్‌పూర్‌ జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. రైతులు ధర్నా చేపట్టిన ప్రాంతంలో ప్యారాగనా వంతెన కూడా ఉంది. అక్కడే ప్రధాని కాన్వాయ్‌ నిలిచిపోయింది. ఆపై వెనక్కి వెళ్లింది. ప్రధాని కాన్వాయ్‌ అటువైపుగా వెళుతుందన్న కచ్చితమైన సమాచారం రైతులకు లేదు. ప్రధాని తిరిగివచ్చాక వారికి ఈ విషయం తెలిసింది. రైతుల ఆందోళన వీడియో చూస్తేగనుక వారు ప్రధాని కాన్వాయ్‌ వైపునకు వెళ్లడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో అలాంటి ఉద్దేశమేమీ లేదని స్పష్టమవుతోంది. బీజేపీ జెండాలు పట్టుకొని, నరేంద్రమోదీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసిన కొద్దిమంది మాత్రమే కాన్వాయ్‌ వద్దకు వెళ్లారు. కాబట్టి ప్రధాని ప్రాణానికి ముప్పు అన్నది కల్పితం’ అని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన పేర్కొంది. ‘తన ర్యాలీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పంజాబ్‌ రాష్ట్రంతో పాటు రైతుల ఉద్యమం ప్రతిష్ఠను మంటగలిపేందుకు ప్రధాని ప్రయత్నించడం గర్హనీయం. ఏదో విధంగా ప్రాణాలతో బయట పడ్డానని ఆయన చెప్పుకోవడం విచారకరం’ అని ప్రకటనలో రైతు నాయకులు బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, డాక్టర్‌ దర్శన్‌పాల్‌, గుర్నామ్‌ సింగ్‌ చౌదుని, హన్నన్‌ మొల్లా, జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రాహన్‌, శివకుమార్‌ శర్మ (కక్కాజీ), యుధ్వీర్‌ సింగ్‌, యేగేంద్ర యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఎవరికైనా ప్రాణగండం ఉన్నదంటే అది రైతులకు, మంత్రులై స్వేచ్ఛగా తిరుగుతున్న అజయ్‌ మిశ్రా వంటి నేరగాళ్ల నుంచి అంటూ అసహనం వ్యక్తంచేశారు. తన పదవి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలను ప్రధాని మరోమారు చేయరని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆశిస్తోందని ప్రకటనలో నేతలు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img