Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతులపై నిందలా..? – దిల్లీ కాలుష్యంపై సుప్రీం

కార్లు ఎలా ఆపాలో మేమే చెప్పాలా?
స్టార్‌ హోటళ్లలో కూర్చొని అన్నదాతపై అపవాదులా?

న్యూదిల్లీ : దిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ప్రతీది కోర్టు ఆదేశిస్తేనే చేస్తామన్న బ్యూరోక్రాట్ల వ్యవహారాన్ని తప్పుపట్టింది. పంట వ్యర్థాలను తగలబెట్టే విషయంలో రైతులను శిక్షించడం తమకు ఇష్టం లేదని, వారం రోజుల పాటు వాటిని తగులబెట్టవద్దని రైతులను కోరాలని ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రాలకు సూచించినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. కారును ఎలా ఆపాలి.. మంటలను ఎలా అదుపు చేయాలి.. అందుకోసం బకెట్టు వాడాలా లేక మరేదైనా వాడాలా.. రాజధాని గాలిని ఎలా శుభ్రపర్చాలి వంటివన్నీ మేమే చెప్పాలా? అంటూ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్సీఆర్‌లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు, వాయువును శుభ్రపర్చేందుకు, దాని నాణ్యతను పెంచేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ (సీఏక్యూఎం) తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు న్యాయమూర్తిగా, గతంలో అడ్వకేట్‌ జనరల్‌గా నేను దేశంలో గమనించింది ఏమిటంటే బ్యూరోక్రసీలో స్తబద్ధత ఉండటం, కోర్టు ఉత్తర్వుల కోసం వారు వేచివుంటారు.. ప్రతీది కోర్టు చెప్పాకే చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ల ధోరణి ఇలా ఉంటోంది. ఇది సరైనది కాదు. సమస్యను ఎలా పరిష్కరించాలో సమావేశంలో అధికారులు నిర్ణయించాలి. ఎలాంటి చర్యలు అమలు చేస్తే బాగుంటుందో చర్చించి ఓ నిర్ణయానికి రావాలి (కాలుష్య నియంత్రణపై కమిషన్‌ సమావేశాన్ని ఉద్దేశించి)గానీ ప్రతిదానికి కోర్టులపై ఆధారపడటం తగదు. అంతా సవ్యంగా ఉండివుంటే కేవలం రెండు నిమిషాల్లో విచారణను పూర్తి చేయొచ్చు. కోర్టు ఉత్తర్వులు రానివ్వండి వాటిపై సంతకాలు చేస్తామంటున్న ఎగ్జిక్యూటీవ్‌ల వైఖరి దురదృష్టకరం ’ అని సీజేఐ రమణ అసహనం వ్యక్తంచేశారు. నిందల క్రీడపై తమకు ఆసక్తి లేదన్న సీజేఐ రమణ.. కాలుష్యం కంటే, టీవీ ఛానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. తుది విచారణను 23కు వాయిదా వేశారు. సీఏక్యూఎం అత్యవసర సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని ఈనెల 15న కేంద్రానికి న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలో ఆ సమావేశం గురించి వివరాలను కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. సీఏక్యూఎం తీసుకున్న చర్యలను వివరించారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, రవాణాతో పాటు నిత్యావసరాలను కాకుండా మిగతా సరకు రవాణా ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేశామని చెప్పారు. ఇంటి నుంచే పనిచేయడాన్ని (వర్క్‌ ఫ్రమ్‌ హోం) ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాంటప్పుడు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు ఎందుకు రావాల్సి వస్తోందని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘మీకు 100శాతం సిబ్బంది అవసరం లేదు. అందరూ కార్లలోనే ప్రయాణిస్తున్నారు. 100 మంది స్థానంలో 50 మందితో పని చేయండని సీజేఐ అన్నారు. దీనిపై మెహతా స్పందిస్తూ దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో పాన్‌ ఇండియా శాఖోపశాఖలు ఉన్నట్లు తెలిపారు. ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల వల్ల కాలుష్యం పెద్దగా ఉండదన్నారు. ప్రభుత్వం కార్‌ పూలింగ్‌, ప్రజా రవాణాను ప్రోత్సహిస్తూ ఉద్యోగుల కోసం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈనెల 21కల్లా పరిస్థితి కాస్త మెరుగవుతుందని అత్యవసర సమావేశంలో భాగమైన వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తమ అంచనా తప్పైతే తీవ్ర చర్యలు తీసుకోవచ్చునన్నారు. (తీవ్ర చర్యల్లో పూర్తి లాక్‌డౌన్‌ వంటివి ఉంటాయి). 21వ తేదీ నాటికి ప్రకృతే మనల్ని కాపాడుతుందా అని జస్టిస్‌ కాంత్‌ ప్రశ్నించగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని, మరిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్య నివారణకు యాంటీ స్మాగ్‌గన్స్‌, దుమ్ముధూళి నియంత్రణ చర్యలు చేపడతామని ధర్మాసనానికి మెహతా చెప్పారు. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని 21వ తేదీ తర్వాత పరిగణనలోకి తీసుకుంటామని సీజేఐ రమణ అన్నారు. పారిశ్రామిక కార్యకలాపాల నియంత్రణకు ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎవరికి అజెండా వారికి ఉంటోందని, ఇక్కడ పరిష్కారం కోసమే తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. కాలుష్యానికి పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమని చెప్పడంపై అసహనం వ్యక్తంచేశారు. దిల్లీలోని 5స్టార్‌, 7స్టార్‌ హోటళ్లలో కూర్చొన్న వారు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకుండా రైతులపై నిందలు మోపడం విచారకరమని జస్టిస్‌ కాంత్‌ అన్నారు. రైతులకు జరిమానాలు విధించలేమని సీజేఐ రమణ స్పష్టం చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతులకు తగు సూచనలు చేయాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. ‘రైతుల వద్ద డబ్బు లేదు. దీపావళి సందర్భంగా 1015 రోజులు బాణాసంచా పేలుళ్లతో కాలుష్యం పెరిగింది. బానాసంచా వల్ల కాలుష్యం పెరగలేదని మీరు చెబుతారా?’ అని ప్రశ్నించారు. ‘ప్రతి అక్టోబరు, నవంబరులో ఇదే అంశంపై సమావేశమవుతున్నాం. ప్రతిసారీ కోర్టే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని జస్టిస్‌ కాంత్‌ అన్నారు. ‘వాస్తవాలు, గణాంకాలు కాదు కాలుష్యాన్ని తక్షణమే తగ్గించే చర్యలే ప్రధానమని సీజేఐ రమణ అన్నారు. బ్యూరోక్రసీ ఒకలాంటి జడత్వాన్ని పెంచిందని, వాహనాన్ని ఎలా సీజ్‌ చేయాలో ఆలోచిస్తున్నారుగానీ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఇలాంటి వైఖరి ఒకలాంటి ఉదాసీనత అని విమర్శించారు. కాలుష్య నివారణపై 24న తిరిగి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
దినసరి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
దిల్లీ`ఎన్సీఆర్‌లో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నిర్మాణరంగ కార్యకలాపాలను ఒక్కసారిగా స్తంభింపజేసినందున ఉపాధి కోల్పోయిన దినసరి కార్మికులకు సంక్షేమ పథకాల కింద పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టును నిర్మాణ రంగ కార్మికుల సంఘం ఆశ్రయించింది. వాయు కాలుష్యానికి ఏది కారణం ఏది కాదన్నది పరిగణనలోకి తీసుకోకుండా అన్ని పనులను నిషేధించడంపై నేషనల్‌ క్యాంపెయిన్‌ కమిటీ ఫర్‌ సెంట్రల్‌ లెజిస్లేషన్‌ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లేబర్‌ అసహనం వ్యక్తంచేసింది. రూ.2,700 కోట్ల నిధి ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడంలో విఫలమైందని ఫిర్యాదులో పేర్కొంది. దిల్లీతో పాటు హరియాణా ప్రభుత్వాలు కాలుష్య కారక కార్యకలాపాలను గుర్తించలేకపోయినట్లు వెల్లడిరచింది. అనవసర నిషేధాల వల్ల లక్షలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోవడం న్యాయమా అని పిటిషన్‌లో ప్రశ్నించింది. నోటీసు లేకుండా పనులు నిలిపివేయడం కార్మికులను వేధించడమేనని, తమకు న్యాయం చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img