Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రోజుకు వంద కోట్ల మద్యం స్కాం

. సీఎం జగన్‌పై రామకృష్ణ విమర్శ
. మోదీవి కక్ష సాధింపు చర్యలని విమర్శ

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజుకు వంద కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అయినా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, ఈటీవీ, ఈనాడు మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్న కోపంతో ఏ ఫిర్యాదు లేకపోయినా రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కక్షసాధింపుకు పాల్పడుతు న్నారని విమర్శించారు. రామోజీరావును విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రలోని కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో మంగళ వారం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌తో కలసి రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదన్న కసితో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు, భర్త వాసుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా జగజ్జనని చిట్స్‌పై కేసులు నమోదు చేశారన్నారు. అప్పారావు, వాసు బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా వారి ఇళ్లు, కార్యాలయాలపై సీఐడీతో దాడులు చేయించారన్నారు. ఇవన్నీ కక్షసాధింపు చర్యలు కాదా అని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, సీఎం జగన్‌ నియంతను మించిపోయారని విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ఏవిధంగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారో…జగన్‌ కూడా దానినే అనుసరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను ఎండగట్టాలని, పాలకుల అప్రజాస్వామిక చర్యలను ఖండిరచాలని ప్రజాతంత్రవాదులకు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో 15జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు దివాలా తీశారని రామకృష్ణ తెలిపారు. మిర్చి పంటకు మినహా ఇతర ఏ పంటకు గిట్టు బాటు ధర రాలేదని, దీంతో రైతులు అల్లాడి పోతున్నారని చెప్పారు. అకాలవర్షాలతో బాధపడు తున్న రైతులను సీఎం జగన్‌ పరామర్శించలేదని ఆరోపించారు. రైతులను ఆదుకోవడం కన్నా ముఖ్య మంత్రికి ఇంకేమి పనులుంటాయని నిలదీశారు. గతంలో ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామ ర్శించి… ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారన్నారు. నీలం సంజీవరెడ్డి, వైయస్‌ రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు సైతం రైతుల దగ్గరకు వెళ్లారని గుర్తు చేశారు. మరోవైపు, కేంద్రంలోనూ మోదీ సర్కారు కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోందన్నారు. ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై అవినీతి ముద్ర వేసి…సీబీఐ, ఈడీతో వేధిస్తోందన్నారు. మరో నాయకుడు మనీశ్‌ సిసోదియాను మద్యంలో కుంభకోణంలో ఇరికించి 50 రోజులుగా జైల్లో పెట్టడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. మోదీకి అనుకూలంగా ఉన్నందున వైఎస్‌ జగన్‌ మద్యం ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి, శ్రీరాములు, నారాయణస్వామి, రామకృష్ణ, కేశవరెడ్డి, రమణ, లింగమయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img