Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లఖింపూర్‌ ఘటన మరువక ముందే… రైతులపై దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు

అంబాలా : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనను మరువక ముందే హరియాణాలోని అంబాలాలో గురువారం అదే తరహా ఘోరం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ రైతు గాయపడ్డాడు. ముందుగా గమనించడంతో రైతులు ప్రాణాలు అరచేత పట్టుకొని పక్కకు పరుగులు తీశారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు అంబాలా సమీపంలోని నారాయణ్‌గఢ్‌లో ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వస్తున్న బీజేపీ నాయకుల కాన్వాయ్‌లోని ఓ కారు రైతును ధీకొట్టింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నారాయణ్‌గఢ్‌`సదౌర రోడ్డులోని సైనీభవన్‌ వద్ద జరిగే కార్యక్రమానికి బీజేపీ ఎంపీ నయబ్‌ సింగ్‌ సైనీ, హరియాణా మంత్రి సందీప్‌సింగ్‌ హాజరవుతున్నారు. వారికి నిరసన తెలిపేందుకు రైతులు అక్కడ గుమికూడారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత బీజేపీ నాయకుల్లో ఒకరి కారు భవన్‌ ప్రీత్‌ అనే రైతును ఢీకొట్టింది. అతని కాలుకి స్వల్పగాయమైంది. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (చాదునిగ్రూప్‌) మీడియా ఇన్‌చార్జి రాజీవ్‌శర్మ చెప్పారు. కాగా, మరో లఖింపూర్‌ఖేరీని సృష్టిస్తామని కారు డ్రైవరు బెదిరించినట్లు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. బీజేపీ ఎంపీ, రాష్ట్రమంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నట్లు తెలి యడంతో నిరసన తెలపడానికి తాము వెళ్లామని, రోడ్డుకు ఇరువైపులా నిలబడి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నామని రైతులు తెలిపారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇన్నోవా కారు వేగంగా రైతులపైకి దూసుకొచ్చిందని చెప్పారు. ఓ రైతు తృటిలో ప్రాణాపా యం నుంచి తప్పించుకున్నాడన్నారు. రైతు భవన్‌ ప్రీత్‌ను డ్రైవర్‌ నేరుగా ఢీకొట్టాడని, దీంతో అతను ఎగిరి రోడ్డుకు రెండోవైపు పడ్డాడని వివరించారు. రాజీవ్‌ అనే వ్యక్తి కారును నడుపుతున్నాడని చెప్పారు. బీజేపీ ఎంపీ ఆదేశాల మేరకు డ్రైవర్‌ ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టాడని తెలిపారు. మరో లఖింపూర్‌ ఖేరీ ఘటన సృష్టిస్తామని డ్రైవర్‌ బెదిరించాడని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img