Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లిఖితంగా ఇవ్వకుంటే… ఉద్యమం యథాతథం

. సీఎస్‌తో ఏపీ జేఏసీ నేతల భేటీ
. అప్పుడే పునరాలోచన : బొప్పరాజు, దామోదరరావు
. నేడు రెవెన్యూ భవన్‌లో అత్యవసర సమావేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై మంత్రుల కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)తో చర్చించిన హామీలపై లిఖిత పూర్వకంగా ఇస్తేనే ఉద్యమం కొనసాగింపుపై పునరాలోచిస్తామని, లేకుంటే యథాతథంగా కార్యాచరణ ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. దీనిపై గురువారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరగనున్న అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల ఆర్థిక అంశాలపై మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, లిఖితపూర్వకంగా ఇచ్చే మినిట్లపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు చర్చిస్తారు. ఈనెల 7వ తేదీ రాత్రి వరకు మంత్రుల కమిటీతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ బృందం, ఇతర జేఏసీ నాయకత్వంతో సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటలపాటు చర్చించారు. ఉద్యోగులు వాళ్ల కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు, చట్టబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఈ నెలాఖరు లోగా (మార్చి 31లోపు) దాదాపు రూ.3 వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం విదితమే. వాటితో పాటు చట్టప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్లు, డీఏ బకాయిల సొమ్ము దాదాపు రూ.2 వేల కోట్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ నెలలోగా రెండు విడతల్లో (రెండు క్వార్టర్లలో) చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నిటిపైనా లిఖిత పూర్వకంగా మినిట్ల ద్వారా తెలియజేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఆల్టిమేటం జారీజేసింది. దానిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని, చర్చించుకుని, ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై నిర్ణయిస్తారు. ఈనెల 7వ తేదీ రాత్రి జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినందున, ఉద్యమ కార్యాచరణ కొనసాగింపు నిలిపివేయాలని ఏపీ జేఏసీ నేతలను మంత్రులు కోరారు. దానిపై ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు అధ్వర్యంలో సీఎస్‌ను కలవగా, వారికి భరోసా ఇచ్చారు.
ఉద్యమం కొనసాగింపుపై నేడు నిర్ణయం
విజయవాడ రెవెన్యూ భవన్‌లో గురువారం జరగబోయే రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వం ఈనెల 7వ తేదీన ప్రకటించిన అంశాలు, మినిట్లలో పొందుపరచే అంశాలపై చర్చించి ఉద్యమ కార్యచరణ కొనసాగింపుపై నిర్ణయిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, కోశాధికారి వీవీ మురళికృష్ట నాయుడు, బి.కిషోర్‌ కుమార్‌, దొప్పలపూడి ఈశ్వర్‌, కనపర్తి సంగీతరావు, ఎస్‌.మల్లీశ్వరరావు, ఎ.సాంబశివ రావు తదితరులు తెలిపారు. సీఎస్‌ను కలిసిన అనంతరం విజయవాడ సీఎస్‌ క్యాంపు కార్యాలయం వద్ద నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చర్చల మినిట్ల ప్రతులను తమకు ఇవ్వకుంటే ఉద్యమం యథాతథంగా ఉంటుందని, వెనక్కి తగ్గబోమని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img