Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లేని అధికారంతో అమరావతి విధ్వంసం

ప్రజాకోర్టులో జగన్‌కు శిక్ష ఖాయం
భూ కబ్జాల కోసమే విశాఖ వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు, కేంద్ర అఫిడవిట్‌ స్పష్టం చేశాయని, లేని అధికారంతో అమరావతి రాజధానిని విధ్వంసం చేస్తున్న సీఎం జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూకబ్జాలు, మైనింగ్‌ దోపిడీ కోసమే జగన్‌ విశాఖ వైపు చూస్తున్నారని, చట్టబద్ధత లేని చట్టం తెచ్చి జగన్‌ మూడు ప్రాంతాల్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్ణయం చట్టబద్ధంగానే జరిగిందని పునరుద్ఘాటించారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌ విధ్వంస పూరిత చర్యలతో జరిగిన నష్టమే ఎక్కువని పేర్కొన్నారు. జగన్‌ లాంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి ఎంత దెబ్బతింటాయో చెప్పడానికి అమరావతి విధ్వంసమే ఒక ఉదాహరణ అని మండిపడ్డారు. శివరామకృష్ణన్‌ కమిటీ ప్రకారమే రాజధాని నిర్ణయం జరిగినట్లు కేంద్రం అఫిడవిట్‌ పేర్కొన్నదని తెలిపారు. కేంద్రం అఫిడవిట్‌, కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభలో చెప్పిన సమాధానం… అమరావతిపై జగన్‌ కుట్రలు, వైసీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల్ని ఎండగట్టిందన్నారు. కేంద్రం ఆమోదంతో విభజన చట్టం ప్రకారం అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించి, సీఆర్డీఏ చట్టం చేశామని చెప్పారు. అమరావతికి ప్రతిపక్ష వైసీపీ నాడు పూర్తి మద్దతు పలికిందని గుర్తుచేశారు. మూడు రాజధానులపై చట్టబద్ధత లేని చట్టం తెచ్చిన జగన్‌…అన్ని ప్రాంతాలను మోసగిస్తున్నారని విమర్శించారు. రాజధానిపై న్యాయస్థానాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ జగన్‌ తన తీరు మార్చుకోలేదని, అమరావతి విషయంలో తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లన్నట్లు జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఆదాయవనరు అమరావతి అని, రైతులు అమరావతి నిర్మాణానికి ఇచ్చిన వేల ఎకరాల ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి దక్కిందని, జగన్‌ ఆ భూముల్ని నిర్వీర్యం చేశారన్నారు. భూములిచ్చిన రైతుల్ని అవమానించారని మండిపడ్డారు. అమరావతి పూర్తయి ఉంటే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు దీటుగా రాష్ట్రానికి పెద్ద ఆదాయం సమకూరేదన్నారు. మరోవైపు రాష్ట్రానికి జీవనాడి పోలవరాన్ని కూడా నాశనం చేశారన్నారు. అసమర్థత, చేతగానితనంతో జగన్‌ రాష్ట్రానికి శనిలా దాపురించారని మండిపడ్డారు. జగన్‌ చెప్పిన న్యాయరాజధాని ఏమైందని నిలదీశారు. ఇప్పటికే నష్టం జరిగిపోయిందని, ప్రజాకోర్టులో జగన్‌ను దోషిగా నిలబెట్టేవరకు టీడీపీ పోరాడుతుందని పునరుద్ఘాటించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img