Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వక్ఫ్‌ సొత్తు… అల్లుళ్లకు పందేరం

. 8.5 ఎకరాలు కట్టబెట్టేందుకు యత్నం
. బోర్డు చైర్మన్‌కు జకియా ఖానమ్‌ సిఫార్సు

విశాలాంధ్ర`విజయవాడ(వన్‌టౌన్‌): అత్తలకు అల్లుళ్లంటే చాలా ప్రేమాభిమానం. ఇందుకోసం ఇంట్లోని పోపు డబ్బాల్లో దాచిన సొమ్మును మూడో కంటికి తెలియకుండా కూతుళ్లు, అల్లుళ్లకు ముట్టచెబుతుంటారు. అయితే, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ మయానా జకియా ఖానమ్‌ ఏకంగా వక్ఫ్‌బోర్డు ఆస్తులను లీజు ప్రాతిపదికన తన అల్లుళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న వక్ఫ్‌ భూములలో 8.50 ఎకరాలను తన ముగ్గురు అల్లుళ్లకు కేటాయిస్తే, ఆ స్థలాల్లో వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకుంటారని ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌ బాషాకు ఆమె సిఫార్సు చేశారు. ఆ సిఫార్సులపై వెంటనే నివేదిక సమర్పించాలని అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల అధికారులకు వక్ఫ్‌బోర్డు సీఈఓ ఖదీర్‌ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. జకియా ఖానమ్‌కు సదాత్‌ అలీఖాన్‌, కోలార్‌ సలాఉద్దీన్‌, తబ్రేజ్‌ అలీఖాన్‌ అల్లుళ్లు. ఈ ముగ్గురూ రాయలసీమ వాసులే. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వారు. సదాత్‌ అలీఖాన్‌కు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఆర్‌ఎస్‌ నంబర్‌ 144లోని మూడు ఎకరాలను, కోలార్‌ సలాఉద్దీన్‌కు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఆర్‌ఎస్‌ నంబర్‌ 199లోని 2.50 ఎకరాలను, తబ్రేజ్‌ అలీఖాన్‌కు కదిరిలోని ఆర్‌ఎస్‌ నంబర్‌ 130లోని మూడు ఎకరాలు కేటాయించాలని డిప్యూటీ చైర్‌పర్సన్‌ కోరారు. తన ముగ్గురు అల్లుళ్లకు వక్ఫ్‌ భూములు కేటాయించాలని జకియా ఖానమ్‌ సిఫార్సు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురి కోసం ఖానమ్‌ సెప్టెంబరు 19న బోర్డు చైర్మన్‌ ఖాదర్‌ భాషాకు లేఖ రాయగా, ఆ భూములను లీజు ప్రాతిపదికన కేటాయింపుపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అదే నెల 30న ఆ జిల్లాల అధికారులకు ఖాదర్‌ ఆదేశాలు జారీ చేశారు. జకియా ఖానమ్‌ సిఫార్సు మేరకు ముగ్గురికి 8.50 ఎకరాలు కేటాయించేందుకు వక్ఫ్‌బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాయలసీమలో వక్ఫ్‌ భూములపై కన్నేసిన రాజకీయ నేతలు ఎన్‌ఓసీ, లీజుల పేరిట కాజేసేందుకు పావులు కదుపుతుండటంతో ముస్లిం మైనార్టీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూములను, ఖాళీ స్థలాలను సాగుకు ఇచ్చి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ ఏకంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌, రెస్టారెంట్‌లకు కేటాయించాలంటూ సిఫార్సు చేయడం గమనార్హం.
కోట్లాది ఆస్తులపై నేతల కన్ను..!
రాష్ట్రంలోని వక్ఫ్‌ భూములను అప్పనంగా కొట్టేసేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నామధ్య రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే నంద్యాల జిల్లాలోని వక్ఫ్‌ భూములు 33 ఎకరాలకు ఎన్‌ఓసీ కోరగా, ఆ తర్వాత రాష్ట్రంలో కీలకమైన పోలీసు ఉన్నతాధికారి తన కుటుంబ సభ్యుల పేరున నంద్యాల పట్టణంలో 4.75 ఎకరాలకు ఎన్‌ఓసీ ఇప్పించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ రెండు ఎన్‌ఓసీలు వక్ఫ్‌ బోర్డు వద్ద పెండిరగ్‌లో ఉండగా, ఇటీవల గుంటూరు జిల్లాలోని మరో 3.49 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం రాజ్‌భవన్‌ నుంచి సైతం బోర్డుకు లేఖ వెళ్లింది. గతంలో ఎన్‌ఓసీకి సంబంధించిన రెండు ఫైళ్లను బోర్డు పెండిరగ్‌ పెట్టగా, తాజాగా లీజు కోసం రెండు సిఫార్సులు వచ్చాయి. దీంతో వీటిపై బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img