Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వచ్చే ఎన్నికల్లో…మోదీ వేవ్‌ పనిచేయదు

విపక్షాలను తక్కువగా చూడవద్దు
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

బెంగళూరు : దేశ వ్యాప్తంగా మోదీ ప్రభ తగ్గుతున్నట్టు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాల నేతల నుంచి రావడం సాధారణమైతే బీజేపీలోని సీనియర్‌ నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వాస్తవికతకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వేవ్‌ పని చేయదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప వ్యాఖ్యానించారు. రెండు రోజుల కిందట దావణగిరిలో జరిగిన రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ వేవ్‌ను నమ్ముకుంటే బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ప్రధానిగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని పార్టీ వేదికపైనే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే మోదీ పేరు మీద అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే భావన పార్టీ క్యాడర్‌లో ఉండడానికి వీల్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అంతసులువుకాదని పార్టీ నేతలను హెచ్చరించారు. ఇందుకోసం ఇప్పటికైనా అభివృద్ధి ఫలాలను సామాన్యులకు అందేలా కృషి చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ నాయకత్వంలో స్థానిక సంస్థల్లో పోటీకి సిద్దమవుతున్న దశలో యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదు విధంగా ప్రతిపక్షాలను తేలికగా తీసుకోకూడదని పార్టీ సహచరులను హెచ్చరించారు. భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికలకు సంబంధించి వారి లెక్కలు వారికున్నాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌కు చెందిన నేత డీకే శివకుమార్‌ బీజేపీ నేతలను తమవైపు తిప్పుకునే ప్రయాత్నాలు చేస్తున్నారని, బీజేపీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటూ రానున్న అన్ని ఎన్నికల్లో ఎదురీత తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి నాయకులను తయారు చేసుకోవాలని, ప్రతి బూత్‌ స్థాయితో 20 నుంచి 25 మంది మహిళలు, యువజన విభాగం నాయకులను నియమించుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img