Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వయోపరిమితిపై నాన్చుడు

నిరుద్యోగుల్లో టెన్షన్‌..టెన్షన్‌..
జూనియర్‌ అసిస్టెంటు పోస్టులు 670
కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ మెలిక
ఆగస్టులో గ్రూప్‌ 1,2 నోటిఫికేషన్లు

అమరావతి : ఏపీపీఎస్సీతోపాటు ఇతర ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..కేవలం 10,143 ఉద్యోగాలతోనే జాబ్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించడంపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. జాబ్‌ క్యాలెం డరులో అరకొర పోస్టులు ఉండటం, జనరల్‌ డిగ్రీ అభ్యర్థులకు అందులో స్థానం లేకపోవడంతో నిరుత్సాహం పెరుగుతోంది. జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలామ్‌బాబు ప్రకటించిన విషయం విదితమే. దానిపై ఇంతవరకూ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఏపీపీఎస్సీ పరిధిలోని బ్యాక్‌లాగ్‌ పోస్టుల నోటిఫికేషన్లను జులై 31లోగా విడుదల చేయాలని ఆర్థికశాఖ ఆదేశించినప్పటికీ..వయోపరిమితి పెంపుపై స్పష్టత రానందున..గడువులోగా వాటిని విడుదల చేయలేకపోయారు. ప్రభుత్వ జాబ్‌ క్యాలెండరు ప్రకారం..ఆగస్టులో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1,2 నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం మొదట విడుదల చేసిన జాబ్‌ క్యాలెండరుకు అదనంగా ఇటీవల మరో 1180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు జారీజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.35 లక్షల ఖాళీలతో జాబ్‌ క్యాలెండరు ఇవ్వాలని డిమాండు చేస్తూ..ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.
జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు
కంప్యూటర్‌ మినహాయించాలి
ప్రభుత్వం రెండో విడత జాబ్‌ క్యాలెండరులోకి అనుమతించిన రెవెన్యూ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ విభాగం

పోస్టులకు కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడం మినహాయించాలని జనరల్‌ డిగ్రీ అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్‌`1,2లలో అతి తక్కువ పోస్టులు ఉన్నందున..వాటిని కనీసం 2వేలకు పెంచాలని డిమాండు చేస్తున్నారు. అదనంగా ఆర్థికశాఖ అనుమతించిన జాబితాలోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌కైనా జనరల్‌ డిగ్రీ అభ్యర్థులకు అనుమతించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆ దిశగా ఏపీపీఎస్సీకి మార్గదర్శకాలు జారీచేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇనిస్టిట్యూట్‌ల నుంచి కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కావాలన్న నిబంధన పెడితే లక్షలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోయి నడిరోడ్డున పడతారు. ఈ పోస్టులకు 10 నుంచి 12 లక్షల మంది అభ్యర్థులు పోటీపడే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరనే నిబంధనను మినహాయించి, నోటిఫికేషన్‌ జారీచేస్తేనే జనరల్‌ డిగ్రీ అభ్యర్థులకు న్యాయం చేకూరుతుంది.
ఉద్యమం ఉధృతం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండరుపై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 5న విజయవాడ, 9,10 విశాఖపట్టణం, 13,14 తిరుపతిలో నిరాహార దీక్షలకు నిరుద్యోగులు సిద్ధమయ్యారు. ఈనెల 15 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రౌండ్‌ టేబుల్‌, చర్చావేదికల ద్వారా నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేసి విద్యార్థి, యువజన, రాజకీయ, ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ పోరాట సమితి నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img