Friday, April 19, 2024
Friday, April 19, 2024

మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు

ప్రధాని మోదీకి ప్రియాంక లేఖ
లక్నో : రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ జరిగే డీజీపీల సదస్సులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శనివారం కోరారు. ప్రధాని సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్‌ ఖేరీ హింస కేసులో అతని కుమారుడు నిందితుడిగా ఉన్నందున మంత్రి పదవి నుంచి మిశ్రాను తొలగించాలని కూడా ఆమె కోరారు. డీజీపీల సదస్సు ప్రారంభానికి కొన్ని గంటల ముందు చదివిని లేఖ ద్వారా ప్రియాంక గాంధీ ఈ మేరకు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ‘నిన్న, మీరు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిజమైన మనస్సుతో, పవిత్ర హృదయంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది నిజమైతే, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం మీ ప్రధాన ప్రాధాన్యత’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అన్నారు. ‘కానీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా ‘తేనీ’ ఇప్పటికీ మీ మంత్రి మండలిలో సభ్యుడిగానే ఉన్నారు. మీరు డీజీపీల సదస్సులో నిందితుడి తండ్రి (ఆశిష్‌ మిశ్రా)తో వేదికను పంచుకుంటే, హంతకులకు ఆదరణ ఇస్తున్న వ్యక్తులతో మీరు ఇప్పటికీ ఉన్నారని బాధిత కుటుంబాలకు స్పష్టమైన సందేశం వెళుతుంది. ఈరోజు దేశంలోని రైతుల గురించి మీ ఉద్దేశం నిజంగా స్పష్టంగా ఉంటే, మీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రితో వేదిక పంచుకోకూడదు. అతనిని తొలగించాలి’ అని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన దేశంలోని రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల సమయంలో అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని అన్నారు. ‘మీరు ప్రధాన మంత్రి, మీరు దేశంలోని రైతుల పట్ల బాధ్యతను బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి పౌరునికి న్యాయం జరిగేలా చూడడం ప్రధాన మంత్రి విధి మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా’ అని ప్రియాంక హిందీలో రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ, ‘లఖింపూర్‌ ఖేరీలో అన్నదాతపై జరిగిన క్రూరత్వానికి దేశం మొత్తం సాక్షిగా ఉంది. రైతులపై వాహనం నడిపిన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు నిందితుడని మీకు తెలుసు’ అని తెలిపారు. ‘రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మొదటి నుంచి న్యాయం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. అయితే ప్రత్యేకంగా ఒక నిందితుడిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది’ అని ఆమె అన్నారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులను కలిశానని, వారు తీవ్ర వేదనలో ఉన్నట్లు చెప్పారు. ‘అన్ని కుటుంబాలకు న్యాయం కావాలి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నందున, వారికి న్యాయం జరుగుతుందనే ఆశ లేదు. లఖింపూర్‌ హింసాకాండ కేసు విచారణలో ప్రస్తుత పరిస్థితి కుటుంబ సభ్యుల ఆందోళన సరైనదేనని రుజువు చేస్తోంది. హోం మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆయనతో (అజయ్‌ మిశ్రా) వేదికను పంచుకున్నారు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img