Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విత్తనోత్పత్తి పెంపుపై రాష్ట్రాలు దృష్టి సారించాలి

వ్యవసాయశాఖమంత్రి తోమర్‌
న్యూదిల్లీ: రానున్న ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడకుండా విత్తనోత్పత్తిని పెంచడానికి తగిన వ్యూహాన్ని రూపొందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలను కోరారు. ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వ సన్నద్ధతపై జరిగిన సమావేశంలో తోమర్‌ ప్రసంగిస్తూ, నకిలీ విత్తనాలు, పురుగుమందుల అమ్మకాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రే అధికమని చెప్పారు. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్న దేశ వ్యవసాయ ఎగుమతులను మరింత పెంచేందుకు వ్యవసాయ ఉత్పత్తులో నాణ్యత పెరిగేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. ‘దేశంలో విత్తనాల కొరత ఉంది. ఈ లోటును ఎలా పరిష్కరించాలో మనందరం చర్చించుకోవాలి. విత్తన అవసరాలను తీర్చడానికి ఒక వ్యూహాన్ని రూపొందించాలని నేను రాష్ట్రాలు, కేంద్ర సంస్థలను కోరాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం ప్రైవేటు కంపెనీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తనాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందుల విక్రయాలపై అనేక ఫిర్యాదులు అందాయి. అయితే ఈ రెండిరటి విక్రయాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలదే ముఖ్య పాత్ర అని మంత్రి అన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను నిర్ధారించడంతో పాటు, ఎరువుల సమతుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తోమర్‌ అన్నారు. రసాయన ఎరువుల దిగుమతులలో సరఫరాలో అంతరాయం ఏర్పడిన సమయంలో ఆహార భద్రతను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యూహం రూపొందించుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహుజా మాట్లాడుతూ… వరుసగా నాలుగో సంవత్సరం దేశంలో రుతుపవనాలు సాధారణ స్థాయిలో వర్షిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని, ఈ ఏడాది మెరుగైన వ్యవసాయ వృద్ధిని సాధించేందుకు ఇది శుభపరిణామమని అన్నారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img