Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విద్యార్థులకు పరీక్షే..!

ఏపీలో 16 నుంచి తరగతులు
పూర్తిగా తగ్గని కరోనా కేసులు
విద్యా సంస్థల పునరుద్ధరణపై గందరగోళం
60 శాతం మంది ఉపాధ్యాయులకే వాక్సిన్‌
పిల్లల వాక్సిన్‌పై అస్పష్టత

కరోనా కేసులు తగ్గుముఖం పట్టకుండా పాఠశాలలను పునరుద్ధరిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. ఇటీవల వరకు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడగా ఎట్టకేలకు వాటిని ప్రభుత్వం రద్దు చేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. ఈనెల 16 నుంచి నూతన విద్యా సంవత్సర ప్రారంభానికి సీఎం జగన్‌ ఆదేశించిన విషయం విదితమే. పాఠశాలల పునరుద్ధరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తూనే.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతం పంపలేమని నొక్కిచెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విభాగాల ఉపాధ్యాయులకు వాక్సినేషన్‌ పూర్తి దశకు చేరలేదు. కేవలం 60 శాతం మందికే వాక్సిన్‌ వేయగా, 40 శాతం మంది మిగిలిపోయారు. చిన్నారులకు వాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది పూర్తి దశకు వచ్చే సరికి చాలా సమయం పడుతుంది. రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారందరికీ పూర్తి స్థాయిలో వాక్సినేషన్‌ నిర్వహించలేదు. వారిలో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కరోనా కేసుల తగ్గుముఖం పట్టకుండా, వాక్సినేషన్‌ పూర్తవ్వకుండా పాఠశాలలకు ఎలా పంపాలంటూ తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు. పైపెచ్చూ థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని, అది పూర్తిగా పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇవన్నీ తెలిసీ ప్రభుత్వం 202122 విద్యా సంవత్సరానికిగాను తరగతుల ప్రారంభానికి సన్నద్ధమ్వవడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో మొత్తం విద్యా వ్యవస్థ గాడి తప్పింది. గత విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వం చివరి దశ వరకూ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించి సుప్రీం కోర్టు సూచనలతో వెనక్కి తగ్గి రద్దు చేసింది. విపక్షాలు పరీక్షలను రద్దు చేయాలని సూచించినప్పటికీ, ప్రభుత్వం మొండి వైఖరితో అభాసుపాలైంది. మళ్లీ ఏకపక్ష వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్తోందనే విమర్శలున్నాయి. రెండేళ్లుగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా తరగతుల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థులకు నష్టం ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది తల్లిదండ్రులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు.
విడతల వారీగా ఉపాధ్యాయుల విధులు
కరోనా సమయంలోనూ విడతల వారీగా ఉపాధ్యాయులకు ప్రభుత్వం విధులు కేటాయిస్తోంది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళుతూ నాడునేడు తరగతులను పర్యవేక్షిస్తున్నారు. విద్యా సంబంధిత పనుల పర్యవేక్షణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. ఇందులో వాక్సిన్‌ వేసుకోని వారున్నారు. దేశంలో పిల్లలకు కరోనా వాక్సిన్‌ ఈ సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని దిల్లీలోని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ప్రకటించారు. అది అమలులోకి వచ్చే సరికి చాలా సమయం పడుతుంది. ఆగస్టు15 నాటికి పాఠశాలల పున: ప్రారంభానికి మాత్రం విద్యార్థులకు కరోనా వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే పరిస్థితుల్లేవు. ఈ దశలో పాఠశాలల పునరుద్ధరణపై ప్రభుత్వం పునరాలోచించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దశల వారీగా తరగతులు ప్రారంభించాలి : ఎస్టీయూ
ఆగస్టు 16 నుంచి కళాశాలలతోపాటు 9,10 తరగతులను మొదటి విడతలో ప్రారంభించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు ప్రభుత్వానికి సూచించారు. కొన్ని రోజుల పరిశీలన అనంతరం తర్వాత దిగువ తరగతులను ప్రారంభిస్తే ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఒక స్పష్టత వస్తుందన్నారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల పునరుద్ధరణ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించాల్సిన అవసరముందన్నారు. ఇంతవరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు వాక్సిన్‌ వేయలేదన్నారు. ఉపాధ్యాయులకు 60 శాతమే పూర్తయిందని, ఇంకా 40 శాతం పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల వాక్సిన్‌పై కేంద్రం నుంచే స్పష్టత రాలేదన్నారు. అన్ని తరగతులను ఏకకాలంలో ప్రారంభించడం ఆరోగ్యకరం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img