Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యుత్‌ సర్దుబాటు చార్జీలపై నిరసన

విద్యుత్‌ సౌధా వద్ద సీపీఐ ధర్నా
ప్రజలపై మోపిన భారాన్ని రద్దు చేయాలి : దోనేపూడి

విజయవాడ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలను శిరసావహిస్తూ కరెంటు సర్దుబాటు చార్జీలు, ఆస్తిపన్ను పెంపు, యూజర్‌ చార్జీలు, చెత్తపై పన్ను వంటి అనేక రూపాలలో వేలాది కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ విమర్శించారు. విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మంగళవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యాన గుణదలలోని విద్యుత్‌ సౌధ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగానే అధిక సంఖ్యలో విద్యుత్‌ సౌధ వద్ద పోలీసులు మోహరించారు. దోనేపూడి శంకర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనకు ఉపక్రమించగా, మాచవరం సీఐ ప్రభాకర్‌, పోలీస్‌ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో దోనేపూడి శంకర్‌కు, సీఐ ప్రభాకర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వెనక్కి తగ్గగా, పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించి, కరెంటు బిల్లుల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ 16 మంది ప్రభుత్వ సలహాదారుల సూచన మేరకు 20142019 కాలంలో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు సర్దుబాటు చార్జీల పేరుతో యూనిట్‌కు రూ.1.23పైసలు చొప్పున దోపిడీకి సిద్దపడి బిల్లులను వినియోగదారులకు పంపారని చెప్పారు. సీఎం పాలనను విస్మరించి ఖజానాను నింపే విధంగా సినిమా టికెట్లు, మాంసం విక్రయాలు, ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. కరెంటు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై విధించిన రూ.3,669 కోట్ల భారాన్ని తక్షణం రద్దు చేయాలని, లేకుంటే మరో విద్యుత్‌ ఉద్యమానికి ప్రజలను సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు.
సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు బుట్టి రాయప్ప అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు తాడి పైడయ్య, ఈడే ప్రసాద్‌, కేవీ భాస్కర్‌రావు, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు, మహిళా సమాఖ్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, మహిళా నాయకులు దుర్గాశి రమణమ్మ, ఆర్‌.సుజాత, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు మూలి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి టి.తాతయ్య, కార్యదర్శి వియ్యపు నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి నగర ప్రధాన కార్యదర్శి షేక్‌ నజీర్‌, అరసం నాయకులు మోతుకూరి అరుణకుమార్‌, సీపీఐ శాఖా కార్యదర్శులు కె.కోటేశ్వరరావు, పడాల పెద్దబాబు, కేఆర్‌ ఆంజనేయులు, జి.వెంకట్రావ్‌, తిప్పాబత్తుల వెంకటేశ్వరరావు, రాచాకుల శ్రీనివాస్‌, కాట్రగడ్డ వాసు, ఎస్‌కే సుభానీ, పార్టీ నాయకులు కొండేటి శ్రీనివాసరావు, రాయన గురునాథం, డి.సూరిబాబు, జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img