Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్య… వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు

. కొత్తగా 17 బోధనాసుపత్రుల నిర్మాణం
. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌
. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం
. విద్యా, వైద్యరంగాల్లో నాడు` నేడుపై చర్చలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : గత మూడు సంవత్సరాల కాలంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేశామని, ఈ ఫలితాలన్నీ ఇప్పటికే కొన్ని కనపడుతుండగా, రాబోయే రెండేళ్లలో అద్భుత సంచనాలు సృష్టించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ‘వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడు’ పై అసెంబ్లీలో మంగళవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో సీఎం ముగింపు ఉపన్యాసం చేశారు. మహానేత వైఎస్సార్‌ మరణం తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. గత ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లో సామాన్యులకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందలేదు. అలాంటి పరిస్థితి నుంచి వాటిని బాగు చేయడం కోసం ఒక డాక్టర్‌గా చికిత్స మొదలుపెట్టాను. అందులో భాగంగా ఆస్పత్రి ఎవరిది అన్నది చూడకుండా, అన్ని ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించాం. అందుకే బాలకృష్ణకు చెందిన ఆస్పత్రికి కూడా చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా బిల్లుల చెల్లింపు జరుగుతోందన్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అన్ని కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గతంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ఈ అక్టోబరు 5 నుంచి ఏకంగా 3118 ప్రొసీజర్లకు పథకం వర్తింప చేస్తున్నామన్నారు. వైద్య-ఆరోగ్య రంగంలో నాడు-నేడు కింద ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,255 కోట్లు వ్యయం చేస్తున్నాం. కొత్తగా ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో మొత్తం 11,888 పనులు చేపట్టగా, వాటిలో ఇప్పటి వరకు 4,851 పనులు పూర్తి చేశాం. విలేజ్‌, వార్డు క్లినిక్స్‌ మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్‌), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్‌)… చివరకు టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ నాడు-నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. దీనివల్ల గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక సీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ లేదా ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చూస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు. ప్రతి మండలంలో నలుగురు వైద్యులు, రెండు 104 అంబులెన్స్‌ సర్వీస్‌లు ఉంటాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అడుగులు వేస్తుండగా, మరోవైపు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటికే దాదాపు 40,800 మందిని నియమించాం. ప్రతి ఆస్పత్రిలో అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు ఉండేలా ఈ అక్టోబరు 15 నాటికి కార్యాచరణ ఇవ్వగా, వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోందని వివరించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ, కొత్తగా మరో 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విద్యారంగంలో అనేక సంస్కరణలు
విద్యారంగంలో దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంస్కరణలు అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వంటి సామాజికవర్గాలు వారు అంతా కూడా స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్థిక, సామాజిక కారణాల వల్ల తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించుకోలేకపోతున్నారు. వీరందరి పిల్లలకు నాణ్యమైన, అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా వారి చదువులు, వారి చేతికి అందేలా చేయగలిగితే ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయని, ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశాలు మెరుగవుతాయన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది కేవలం ఒక నినాదంలా కాకుండా… రైట్‌ టు ఇంగ్లీషు ఎడ్యుకేషన్‌, రైట్‌ టు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఈ రెండు కూడా వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చి, వాళ్లందరినీ కూడా గొప్పగా చదివించే బాధ్యతను మనందరి ప్రభుత్వం తీసుకుందని వివరించారు. విద్యా రంగంలో ఇలాంటి గొప్ప మార్పుల్లో భాగమే మనబడి నాడు-నేడు కార్యక్రమమని, దీనిద్వారా ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో కూడా 12 రకాల మార్పులు అందరికీ అర్ధం అయ్యేలా, స్పష్టంగా కనిపించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేలకు పైగా ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రీిప్రైమరీలుగా, ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మారుతున్న అంగన్‌వాడీలను, హాస్టళ్లను కూడా మనబడి నాడు-నేడు కార్యక్రమంలోకి తీసుకువచ్చామన్నారు. అలాగే మొత్తం 57వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం అక్షరాలా రూ.16 వేల కోట్ల ఖర్చు చేస్తోందని తెలిపారు. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44,968 పాఠశాలలు, కళాశాలల్లో 47 వేల మంది ఆయాలను రూ.6 వేల గౌరవ వేతనంతో పాటు… వారికి క్లీనింగ్‌ సామాగ్రి, గ్లోవ్స్‌ ఇస్తూ నియమించామన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద మనం రూ.20 వేల వరకు ఇచ్చే వసతిదీవెన పథకాల వల్ల… 18-23 ఏళ్ల మధ్య వయస్సులో కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో-జీఈఆర్‌) పెరిగిందన్నారు. ముఖ్యంగా అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. మనం నాటుతున్న విత్తనాలు మొలకెత్తి, పెరిగి ఫలాలు రావడానికి కాస్తా సమయం పడుతుంది. ఒక్కసారి ఫలాలు వస్తే పూర్తిగా దేశంతో కాదు ప్రపంచంలో పోటీపడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నానంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img