Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

27న నామినేషన్‌
తృణమూల్‌కు రాజీనామా

న్యూదిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైనట్లు విపక్షాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ సహా అనేక విపక్షాలు సిన్హాకు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్‌ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్‌ సిన్హా సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 27న ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు శరద్‌ పవార్‌ వెల్లడిరచారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. శరద్‌ పవార్‌ నేతృత్వాన మంగళవారం పార్లమెంట్‌ అనెక్స్‌లో విపక్షాలు భేటీ అయ్యాయి. సిన్హా పేరును ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా సిన్హా పేరు ఖరారు కావడం సంతోషంగా ఉందని జైరాం రమేశ్‌ చెప్పారు. సమావేశం అనంతరం ఉమ్మడి ప్రకటనను జైరాం రమేశ్‌ మీడియాకు చదివి వినిపించారు. ‘ప్రజా జీవితంలో యశ్వంత్‌సిన్హా అనేక పదవులు అలంకరించారు. గొప్ప పాలనాదక్షుడు. ఉత్తమ పార్లమెంటేరియన్‌. వాజ్‌పేయి హయాంలో ఆర్థిక, విదేశాంగమంత్రిగా పనిచేశారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడిన నేత. రాజ్యాంగ విలువలకు బద్ధుడు’ అని ఆ ప్రకటన పేర్కొంది. రాష్ట్రపతిగా యశ్వంత్‌సిన్హాను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ సర్కారు కనీస ప్రయత్నం చేయలేదని జైరాం రమేశ్‌ విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి పవార్‌, గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్‌ అబ్దుల్లా నిరాకరించిన తర్వాత యశ్వంత్‌సిన్హా పేరు తెరపైకి వచ్చింది. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, టీంఎంసీ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎంఐఎం, ఆర్‌జేడీ, ఏఐయూడీఎఫ్‌ సహా ఇతర పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి మల్లికార్జున ఖర్గె, జైరాం రమేశ్‌, తృణమూల్‌ నుంచి అభిషేక్‌ బెనర్జీ, డీఎంకే నుంచి తిరుచి శివ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేడీ, ఆప్‌, ఎస్‌ఏడీ, వైసీపీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. కాగా, దీనికి ముందు యశ్వంత్‌సిన్హా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. దేశప్రయోజనాలు, విపక్షాల ఐక్యత కోసం టీఎంసీని వదులుకోవాల్సి వచ్చిందని సిన్హా చెప్పారు.
యశ్వంత్‌ సిన్హా రాజకీయ నేపథ్యం
ఐఏఎస్‌కు 1984లో రాజీనామా చేసిన యశ్వంత్‌ సిన్హా జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 1998, 1999, 2009లో రaార్ఖండ్‌లోని హజారీబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2002లో వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగమంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఏడాది పాటు (1998) కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చి గతేడాది తృణమూల్‌లో చేరారు. తృణమాల్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ మంగళవారం ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాజ్‌పేయికి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు. ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img