Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వివేకా కేసులో కీలక పరిణామాలు… అవినాశ్‌ రెడ్డికి సునీత షాక్‌

. హైకోర్టు స్టేలో మెరిట్‌ లేదంటూ సుప్రీంలో పిటీషన్‌
. స్వేచ్ఛగా సీబీఐ దర్యాప్తు జరిపేలా చూడాలని వినతి
. మళ్లీ 7 గంటల పాటు అవినాశ్‌, భాస్కరరెడ్డి, ఉదయకుమార్‌ విచారణ
. కౌంటర్‌ దాఖలు చేయాలని అప్రూవర్‌ దస్తగిరికి హైకోర్టు నోటీసు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో గురువారం మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటున్న ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కు తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేయడం, దానిపై విచారించిన కోర్టు ఈనెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై వివేక కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మెరిట్‌ ప్రకారం లేవని, దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తీసుకోవడం సరైంది కాదన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపై గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు నిర్ణయం ఉందన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందని, న్యాయస్థానం ఆదేశాల మేరకు హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని చేధించే పనిలో సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా సీబీఐ దర్యాప్తు జరిపేలా అనుమతించాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు. ఈనెల 30వ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రాధాన్యతను పట్టించుకోకుండానే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో దర్యాప్తుకు అవరోధాలు కలిగించేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని సునీతా రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు.
రెండోరోజూ వేర్వేరుగా విచారించిన సీబీఐ
సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు కూడా దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇప్పటికే ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు వారి ముగ్గురినీ వేర్వేరుగా విచారించినట్లు తెలిసింది.
దస్తగిరికి కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని, ఆయనను అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు… ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని నిందితుడు దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనూ ఇదే కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని కోర్టు కొట్టివేస్తూ దస్తగిరి అప్రూవర్‌గా మారడం సరైందేనని సమర్థించింది. ఆ నేపథ్యంలో అప్పట్లో దస్తగిరి రెండోసారి వాంగ్మూలం ఇచ్చారు.
దస్తగిరికి సెక్యూరిటీ పెంచిన సీబీఐ
వివేకా కేసులో దూకుడు పెంచిన సీబీఐ, అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సెక్యూరిటీ పెంచింది. దస్తగిరికి రక్షణగా ఇప్పటికే ఉన్న కానిస్టేబుల్‌తో పాటు మరో ఐదుగురు పోలీసుల సిబ్బందితో రక్షణ కల్పించారు. ఆయన ఇంటి సమీపంలోనూ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని దస్తగిరి మీడియాకు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు సెక్యూరిటీని పెంచాలని కోరారు. దీంతో దస్తగిరికి పోలీసులు భద్రత పెంచారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరిన సీబీఐ
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని తెలంగాణా హైకోర్టును సీబీఐ కోరింది. సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో గంగిరెడ్డి కీలక వ్యక్తి అని, కుట్ర, హత్య చేయడంలో అతనిది ప్రముఖ పాత్ర అని అని కోర్టులో తెలిపారు. సిట్‌ ఛార్జిషీట్‌ వేయనుందునే ఆయనకు బెయిల్‌ వచ్చిందని, వివేకా హత్య వెనుక భారీ కుట్రను చేధించేందుకు ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img