Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వివేకా హత్య కేసు పరిణామాలతో వైసీపీలో ప్రకంపనలు

. ముఖ్యనేతలతో సీఎం జగన్‌ సమావేశం
. ఎంపీ అవినాశ్‌ను అరెస్ట్‌ చేస్తారన్న నేపథó్యంలో చర్చ
. పార్టీపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు
. నేడు విచారణ హాజరు కావాలని సీబీఐ మళ్లీ నోటీసు జారీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర కీలకమని సీబీఐ అధికారులు తేల్చడం, వారిని అరెస్ట్‌ చేసే ప్రక్రియ ప్రారంభించడం వంటి పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ కేసులో సాక్ష్యా ధారాలను తారుమారు చేసే అంశంలో కీలకంగా వ్యవహరించారన్న అభియోగంపై సీఎం జగన్‌కు మరో సొంత బాబాయ్‌ వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. సోమవారం ఆయన కుమారుడైన ఎంపీ అవినాశ్‌ రెడ్డిని హైదరాబాద్‌కు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. దీంతో ఆయనను కూడా ఖాయంగా అరెస్ట్‌ చేస్తారని భావించి, ముందస్తు బెయిల్‌కు తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ సాయంత్రానికి వాయిదా పడిరది. అప్పటివరకు సీబీఐ అధికారులను అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథó్యంలో అనంతపురం పర్యటనతో పాటు, అధికారిక సమీక్షలను సైతం రద్దు చేసుకున్న సీఎం జగన్‌, పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి సుమారు 10 వాహనాల్లో తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్‌ బయల్దేరినపుడు ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాశ్‌తో చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు చెవిరెడ్డి వివరించినట్లు సమాచారం. మరోవైపు అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 న కుటుంబ సభ్యులతో లండన్‌ వెళ్లేందుకు జగన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో జగన్‌ లండన్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్డ్‌ విమానంలో లండన్‌ వెళ్లేందుకు జగన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. కాని వివేకా కేసులో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో లండన్‌ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠత
వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కరరెడ్డిని ఆదివారం సీబీఐ పోలీసులు అరెస్ట్‌ చేయగా, సోమవారం మధ్యాహ్నాం విచారణకు హాజరు కావాలని ఆయన కుమారుడు అవినాశ్‌రెడ్డిని ఆదేశించింది. దీంతో ఆయన విచారణకు హాజరుకాకముందే ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సాయంత్రం వరకు అతనిని అరెస్ట్‌ చేయవద్దని సీబీఐను ఆదేశించింది. కోర్టు తీర్పు ఎలా వస్తుందో, సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేస్తారా ? లేదా ? అనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. లంచ్‌ మోషన్‌ పిటీషన్‌లో అవినాశ్‌ రెడ్డి తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్సీ ద్వారా మృతుని కుమార్తె సునీత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీబీఐ అధికారులు కుమ్మక్కయి, ఎటువంటి ఆధారాల్లేనప్పటికీ తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. గూగుల్‌ టేక్‌ ఔట్‌తోపాటు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, వాస్తవ విషయాలపై దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టులో విచారణ మరుసటి రోజుకి వాయిదా పడగా, సీబీఐ అధికారులు ఈలోపే మంగళవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా మరోసారి అవినాశ్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సునీత ఇంప్లీడ్‌ పిటీషన్‌
అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయగా, దీనిపై తన వాదనలు కూడా వినాలని హతుడు వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. మరోవైపు రిమాండ్‌లో ఉన్న వైఎస్‌ భాస్కరరెడ్డి, ఆయన అనుచరుడు ఉదయకుమార్‌ రెడ్డిలను సమగ్రంగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. నిందితులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img