Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విశాఖలో సీఎం ఇల్లు

. ముమ్మర ఏర్పాట్లలో అధికారులు
. రూ.100 కోట్లకుపైనే ఖర్చు
. సీఎం నివాస సముదాయంగా బే పార్క్‌?

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దిల్లీలో పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాను కూడా ‘విశాఖపట్నం షిఫ్ట్‌ అవుతున్నా, మీరు రండి’ అని చెప్పడంతో అధికారులు మరింత దూకుడు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పరిపాలన రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కసరత్తు చేస్తోంది. వీఏంఆర్‌డీఏ, టూరిజం, జిల్లా అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో విశాఖలో జరగనున్న పెట్టుబడిదారుల సమ్మిట్‌, జీ20 సదస్సుల పేరుతో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేశారు. అత్యధికంగా బీచ్‌ రోడ్డు ప్రాంతం పైన, సీఎం నివాస పరిసర ప్రాంతాలపైన అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తోంది. బోయపాలెం వద్ద ఒక విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకూ ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసింది. ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేలా ప్రణాళిక రచిస్తున్నారు. మరో పక్క ఇటీవల మంత్రి అమర్నాథ్‌ అధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అంతర్గతంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో వివిధ రకాల పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.350 కోట్ల మేర బకాయిలున్నాయి. వీటిని త్వరగా చెల్లించి మౌలికవసతుల పనులకు సహకరించాలని వారిని కోరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో ఫ్లైఓవర్‌ పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్‌) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కి.మీ రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. త్వరలో దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడి గృహాలకు టీడీఆర్‌ లేదా భూములు ఇవ్వడమా అన్నది యోచిస్తున్నారు. చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు.
తెరపైకి అనేక ప్రతిపాదనలు
ప్రస్తుతం అనుకుంటున్న మార్గాన్ని తీర్చిదిద్దడంలో అనేక కీలక ప్రతిపాదనలు తెరమీదకి వస్తున్నాయి. వివాదాస్పద 2 కి.మీ బీఆర్‌టీఎస్‌ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కూడలి దాకా 6 కి.మీ మేర మౌలిక వసతుల కల్పనకు యోచిస్తున్నారు. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగానే ప్రతిపాదించనున్నారు. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చి సమీపంలో కొండవాలుకు రక్షణగా గోడ నిర్మించనున్నారు.
సీఎం భద్రతా సిబ్బంది పరిశీలన
ఇటీవల ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది నగరానికి వచ్చి విమానాశ్రయం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల మధ్య మార్గాన్ని పరిశీలించారు. మార్గమధ్యలో రోడ్డుకు రెండువైపులా కొన్ని మార్పులు చేయాలని సూచించారు. వీరి సూచనలకు అనుగుణంగా జీవీఎంసీ కార్యాచరణ రూపొందిస్తోంది.
పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి వారంలో రెండు రోజులు విశాఖ వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
బీచ్‌రోడ్డులో ముఖ్యమంత్రి నివాసం
నగరానికి వచ్చాక ముఖ్యమంత్రి నివాసం ఎక్కడుంటుంది అనే విషయమై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీచ్‌రోడ్డులోని ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ‘స్మార్ట్‌ సిటీ’లో భాగంగా పూర్తయిన కొన్ని కీలక కట్టడాలు ఉన్నాయి. వీటితో పాటు ఓ ఫంక్షన్‌ హాలునూ, ఓ అతిథి గృహాన్ని పరిశీలిస్తున్నారు.
అయితే బీచ్‌ రోడ్‌లో ఉన్న బే పార్కును ప్రస్తుతం సీఎం నివాసంగా ఏర్పాటు చేసేందుకు భద్రతాధికారులు, సీఎంఓ కార్యాలయం ముఖ్య అధికారులు భావిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం ద్వారా తెలిసింది. రుషి కొండపై నిర్మిస్తున్న సీఎం శాశ్వత నివాసానికి నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి బే పార్కు లో సీఎం జగన్‌ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర రీజినల్‌ కో`ఆర్డినేటర్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొంతమంది అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. మొత్తానికి విశాఖలో సీఎం రాక హడావిడి ఏర్పాట్లు మొదలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img