Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

దిల్లీలో రెండోరోజూ కొనసాగిన ఆందోళనలు
వైసీపీ, టీడీపీ ఎంపీలు, సీపీఐ, సీపీఎం నేతలు హాజరు

అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీలో రెండో రోజు కూడా ఆందోళనలు పెద్దఎత్తున కొనసాగాయి. మంగళవారం ఏపీ భవన్‌ వద్ద విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ధర్నా చేపట్టగా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొని సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌, ఎం.వి.వి.సత్యనారాయణ, టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రావుల వెంకయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కె.వి.వి.ప్రసాద్‌, మల్నీడు యలమందరావు, కాటమయ్య, ఏపీ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమ నేతలు ఆదినారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది. విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు.. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ప్రాణాలైనా అర్పిస్తాం` విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. అంటూ ఈ సందర్భంగా కార్మికులు నినదించారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మోదీకి ఘోరీ కడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత 178 రోజులుగా నిరవధిక ఆందోళనలు కొనసాగిస్తున్నా, ప్రధాని మోదీ మాత్రం ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగేది లేదంటూ బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అందువల్ల ఈ ఉద్యమ తీవ్రతను పార్లమెంటులోనే ఎంపీలు తెలియజేసేలా పోరాడాలన్నారు. అందుకోసం ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలంతా ఏకమై పార్లమెంటును స్థంభింప జేయాలన్నారు. అలాగే సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఇద్దరూ ప్రత్యక్ష పోరుకు దిగాలని, అప్పుడే కేంద్రం దిగొస్తుందన్నారు. పూర్వీకులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి మనకు అప్పగించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను మనం రక్షించుకోలేకపోతే ఇక తెలుగువాడు మొఖమెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇందుకోసం కమ్యూనిస్టులుగా తాము ముందుండి పోరాడతామని, జైళ్లకు వెళ్లడానికైనా, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఉద్యమం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయ పోరాటం చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్నారు. సొంత గనులు ఇవ్వాలని, అప్పును ఈక్విటీగా మార్చాలని సూచించామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యోగుల యాజమాన్యంలో ఉంచితే బాగుంటుందన్నది తన ఉద్దేశమన్నారు. ఈ ఉద్యమాన్ని మరో ఏడాది ఇలాగే కొనసాగిస్తే ఎన్నికల ముందు ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని అన్నారు. అందువల్ల అందరం సంఘటితంగా పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నా యుడు, కేశినేని నానిలు మాట్లాడుతూ దక్షిణాంధ్ర, ముఖ్యంగా ఆంధ్రులంటే కేంద్రానికి చిన్నచూపుగా ఉందని, విశాఖ ఉక్కును కాపాడుకుని మన సత్తా ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి, వేల ఎకరాలు భూములిచ్చి, ఇప్పటివరకు కేంద్రానికి వేల కోట్లు పన్నులు చెల్లించి దేశానికే గర్వకారణంగా నిలిచిన విశాఖ ఉక్కును తెలుగు ప్రజల ఆమోదం లేకుండా ఎవడబ్బ సొత్తని విక్రయిస్తారని కేంద్రంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాజకీయాలకతీతంగా పోరాడటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, ఇందుకోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనను పురస్కరించుకుని ఏపీ భవన్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img