Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ పాదయాత్ర

ఉక్కు కార్మికులకు అపూర్వ మద్దతు

విశాలాంధ్ర`కూర్మన్నపాలెం:
విశాఖ ఉక్కుపై మోదీ సర్కారు తీరును ఉక్కుకార్మికులు తూర్పారబట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటామని, ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగాలకైనా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. సుదీర్ఘకాలంగా ఉద్యమాలు చేస్తున్నా మోదీ సర్కారుకు చలనం లేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, యువ కార్మికుల అధ్వర్యంలో శనివారం పెదగంట్యాడ, కూర్మన్నపాలెం జంక్షన్ల నుంచి సింహాచలం తొలిమెట్టు వరకు కార్మికులు పాదయాత్ర చేశారు. ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం ఆరు గంటలకే పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర పాతగాజువాక చేరేసరికి…అక్కడ వివిధ రాజకీయ, కార్మిక, ప్రజాసంఘాల ప్రతినిధులు కలిశారు. పాదయాత్రకు మద్దతు తెలిపారు. పాతగాజువాక మీదుగా పంతులుగారి మేడ, నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెం, షీలానగర్‌, విమానాశ్రయం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, బుచ్చిరాజుపాలెం, బాజీ జంక్షన్‌, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల, సింహాచలం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రికులపై దారి పొడవునా ప్రజలు పూలవర్షం కురిపించారు. కొన్నిచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఉక్కు కార్మికులకు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ, పళ్లు అందజేసి సంఫీుభావం ప్రకటించారు. పాదయాత్రలో కార్మికసంఘాల నేతలు, సీబీఐ మాజీ జేడీ, రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. గాజువాక వద్ద పాదయాత్రలో కలిసిన లక్ష్మినారాయణ సింహాచలం వరకు కలిసి నడిచారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, జనసేన పీఏసీ సభ్యుడు కోనా తాతారావు, కార్పొరేటర్లు దల్లి గోవింద్‌, బి.గంగారావు మద్దతు తెలపగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, కన్వీనర్‌ కేఎస్‌ఎన్‌ రావు, కో కన్వీనర్లు జె.అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, నాయకులు మస్తానప్ప, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, డీవీ.రమణ, రామస్వామి, వైటీ దాసు, కారు రమణ, మసేన్రావు, యెల్లేటి శ్రీనివాసరావు, జెర్రిపోతుల ముత్యాలు, జె.రామకృష్ణ, గంగవరం గోపి, వి.ప్రసాద్‌ పరంధామయ్య, కామేశ్వరరావు, ఓబీసీ అసోసియేషన్‌ కార్యదర్శి ముసిరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img