Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

విశాలాంధ్ర – హైదరాబాద్‌: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీహెచ్‌ఇఎల్‌కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. బీమా పథకాలన్నీ ఎల్‌ఐసీకి అప్పగించారని, నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చినవారికి అప్పగించడం.. కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎస్‌ఏఐఎల్‌ ద్వారా బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బయ్యారం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నోసార్లు కలిశానని, బైలాదిల్లా నుంచి బయ్యారానికి పైప్‌లైన్‌ ఖర్చు 50శాతం భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి కదలిక లేదని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం వెనుక ఉన్న కుట్రను గుర్తించలేకపోయామని, 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్‌ బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ కంపెనీ పెట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను గుజరాత్‌లో ని ముంద్రాకు తరలించేలా ప్రణాళిక చేశారని మంత్రి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని, అదానీ కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. బైలదిల్లా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడిరదని, నష్టాలను చూపించి దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోదీ విధానమని అన్నారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ చేస్తున్న కుట్రను.. ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
పరువు నష్టం దావాకు కూడా సిద్ధమే…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక పెద్ద కుట్ర దాగుందన్న నా ఆరోపణలు అబద్ధమైతే పరువునష్టం దావాకు కూడా సిద్ధమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం బిడ్డు వేయడంపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండిరచారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని అడుగుతున్నా అన్నారు. విషయం పరిజ్ఞానం లేని ఆయనకు చెబితే ఓ బాధ చెప్పకుంటే ఓ బాధ అని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బయ్యారం నుంచి బైలదిల్లా 150-160 కిలోమీటర్లు, అలాగే బైలదిల్లా నుంచి విశాఖ 600 కిలోమీటర్ల దూరం ఉందని, అదే ముంద్రాకు 1800 కిలోమీటర్లు దూరం ఉందని తెలిపారు. ఇక్కడ ఫీజబుల్‌ కాదు కానీ తవ్వి 1800 కిలోమీటర్లు తీసుకెళ్తే ఫీజబుల్‌ ఎట్లయితదని నిలదీశారు. ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చని, అర్థమైనా అదానీ కోసం నోరు మూసుకోవచ్చని అన్నారు. వీళ్లు అర్థం చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని, వైజాగ్‌ పొట్టకొడుతున్నది ప్రధాని, అదానీ అని అలాగే బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని, ఆదానీయే అన్నారు. ఇది నిర్దిష్టమైన ఆధారాలతో చేస్తున్న ఆరోపణ అని నేను చెప్పిన మాట తప్పయితే పరువు నష్టం దావా వేయండని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img