Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కౌంటర్లు దాఖలు చేయండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు హైకోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్‌ఐఎన్‌ఎల్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాలు తక్షణమే కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపించారు. ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కు విరుద్ధమని తెలిపారు. రైతుల నుంచి 22 వేల ఎకరాలు తీసుకొని అర్ధశతాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు సుమారు 9,200 మంది రైతులకు ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల కుటుంబాల్లో నాలుగవ తరం వచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని, దానిని నిలబెట్టుకోవడానికి కార్మికులు తీవ్ర కృషి చేశారని, లాభాల బాటలో నడుస్తున్న పరిశ్రమను ప్రైవేటీకరించడం దారుణమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యక్షంగా వేలాదిమందికి, పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నదని వివరించారు. పరిశ్రమకు ప్రభుత్వం ఖర్చు పెట్టినదానికంటే తిరిగి చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి గనులు కేటాయించకుండా, నష్టాల నివారణకు కేంద్రం కనీస చర్యలు తీసుకోకుండా మొండిగా ప్రైవేటీకరణకు యత్నిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు చెప్పారు. ఆ మేరకు అసెంబ్లీలోనూ తీర్మానం చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా తాము అనేక మార్గాలు ప్రతిపాదించామని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దీనిపై కేంద్రం, ఆర్‌ఐఎన్‌ఎల్‌, రాష్ట్ర ప్రభుత్వం, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ తక్షణమే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img