Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌కు
వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య పురస్కారం

. సాహిత్యంలో సుదీర్ఘకాల సేవలు
. ముద్రణారంగంలో ఎనలేని కృషి సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సాహిత్యరంగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ విశేష సేవలందిస్తూ సుదీర్ఘకాలం నుంచి సామాజిక, అభ్యుదయ భావజాల రంగాల్లో ప్రచురణలను ముద్రిస్తూ ఎంతో ఆదరణ పొందుతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు పొందిన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌కు, యాజమాన్యానికి సీఎం అభినందనలు తెలిపారు. విజయవాడ ఏకన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌`2022 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, విశిష్ఠ అతిథిగా సీఎం జగన్‌, ఆత్మీయ అతిథిగా వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది ప్రముఖులకు (30 సంస్థలకు) అవార్డులను గవర్నరు, సీఎం అందజేశారు. సాహిత్య రంగానికిగాను విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌కు సంస్థ మేనేజర్‌ టి.మనోహర్‌ నాయుడుకు అవార్డు కింద రూ.10లక్షల చెక్కు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, పతకాన్ని సీఎం జగన్‌ అందజేశారు. సీఎం మాట్లాడుతూ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ చేస్తున్న ఎనలేని సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డును ప్రకటించిందన్నారు. ప్రభుత్వం తరపున ఈ అత్యున్నత అవార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అవార్డు స్వీకరణ కార్యక్రమానికి విశాలాంధ్ర జనరల్‌ మేనేజర్‌ పి.హరినాథ్‌రెడ్డి హాజరయ్యారు.
వీపీహెచ్‌కి అవార్డు అభినందనీయం: రామకృష్ణ
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌(వీపీహెచ్‌)కి వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు స్వీకరణ అనంతరం విజయవాడ దాసరిభవన్‌లో రామకృష్ణను విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ మేనేజర్‌ టి.మనోహర్‌నాయుడు కలిసి అవార్డు వివరాలు తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య రంగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ఎంతో కృషి చేస్తోందన్నారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డు రావడం పట్ల విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img