Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

‘విష వలయం’ నుంచి దేశం బయటపడుతోంది

పేదల జీవనం మెరుగుకు ప్రయత్నించాం
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సత్తా పెరిగింది
ప్రధాని మోదీ

న్యూదిల్లీ : అవినీతి, కుంభకోణాలు, బంధుప్రీతి, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షతతో 2014కి ముందు చిక్కుకున్న ‘విష వలయం’ నుంచి భారతదేశం బయటపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. తమ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పేదల సంక్షేమానికి అంకితమయ్యిందని తెలిపారు. ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ దేశం పట్ల ఉన్న విశ్వాసం, ప్రజల ఆత్మవిశ్వాసం అపూర్వమైనవని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. పీఎం-కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ కింద ప్రయోజనాలను విడుదల చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ ప్రతికూల ప్రభావం నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారిందని మోదీ అన్నారు. ప్రపంచం కొత్త ఆశలు, విశ్వాసంతో దేశం వైపు చూస్తోందని అన్నారు. 2014కు ముందు ఇరుక్కున్న అవినీతి, వేల కోట్ల కుంభకోణాలు, బంధుప్రీతి, ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్ష వంటి విష వలయాల నుంచి దేశం బయటపడుతోంది’ అని మోదీ గత కాంగ్రెస్‌ పాలనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘అత్యంత కష్టతరమైన రోజులు కూడా గడిచిపోతాయనడానికి పిల్లలైన మీకు ఇది ఒక ఉదాహరణ’ అని ఆయన అన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌, జన్‌ ధన్‌ యోజన లేదా హర్‌ ఘర్‌ జల్‌ అభియాన్‌ వంటి సంక్షేమ విధానాలను ప్రస్తావిస్తూ, సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మోదీ చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యునిగా మేము కష్టాలను తగ్గించడానికి, దేశంలోని పేదల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాం’ అని ప్రధాని తెలిపారు. సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా పేదలు వారి హక్కులు పొందేలా ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు నిరుపేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ నమ్మకాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం ఇప్పుడు 100 శాతం సాధికారత ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో భారతదేశం సాధించిన ఎత్తులు ఇంతకు ముందు ఎవరూ ఊహించలేరని, నేడు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సత్తా పెరిగిందని అన్నారు. ఈ భారత యాత్రకు యువశక్తి నాయకత్వం వహిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ కలల కోసం మీ జీవితాన్ని అంకితం చేయండి, అవి సాకారమవుతాయి’అని ప్రధాన మంత్రి అన్నారు. మోదీ మొదటిసారిగా మే 26, 2014న ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, రెండోసారి మే 30, 2019న ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img