Friday, April 19, 2024
Friday, April 19, 2024

వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
జశ్వంత్‌ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత

విశాలాంధ్ర`బాపట్ల : దేశ సరిహద్దుల్లో ముష్కరుల కాల్పుల్లో అమరుడైన వీర జవాను జశ్వంత్‌రెడ్డికి సైనిక లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. జోహార్‌ జశ్వంత్‌రెడ్డి అంటూ అశ్రనయనాలతో నినదించారు. ‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన నీవు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచావు..జస్వంత్‌రెడ్డి అమర్‌ రహే’ నినాదాలతో బాపట్ల మార్మోగింది. వేలాదిమంది ప్రజలు, అధికారులు, నేతలు బరువెక్కిన హృదయాలతో వీరజవాను మరుప్రోలు జశ్వంత్‌రెడ్డికి కన్నీటి నివాళి అర్పించారు. శనివారం తెల్లవారు జామున రెండున్నర గంటలకి జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం పోలీసులు, ఆర్మీ జవాన్ల ఎస్కార్టుతో బాపట్ల చేరుకుంది. జశ్వంత్‌ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ఆయన స్వగ్రామం దరివాద కొత్తపాలేనికి ప్రజలు బారులు తీరారు. శనివారం ఉదయం 10 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. మేళ తాళాలు, బాణసంచా పేలుళ్లతో అంతిమయాత్ర సాగింది. జశ్వంత్‌ భౌతికకాయంపై స్థానికులు, ప్రజలు దారిపొడవునా పూలవర్షం కురిపించారు. అతిమయాత్రం జశ్వంత్‌ ఇంటి వద్ద నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల స్మశాన వాటికకు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. భౌతికకాయాన్ని ఆర్మీ జవాన్లు మోయగా మధ్యలో బంధువులు, స్నేహితులు భుజాలపై ఎత్తుకున్నారు. స్మశాన వాటిక వద్ద ప్రభుత్వం తరపున హోంమంత్రి సుచరిత, ఉప సభాపతి కోనా రఘుపతి, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, ఎస్పీ విశాల్‌ గున్నీ, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు జశ్వంత్‌ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. ఆర్మీ జవాన్లు గౌరవ వందనాన్ని సమర్పించారు. జవాన్‌లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు రెండు నిమిషాలు మౌనం పాటించగా ఆర్మీ జవాన్లు మూడురౌండ్లు గాలిలో కాల్పులు జరిపి జశ్వంత్‌రెడ్డికి గౌరవ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. జశ్వంత్‌ భౌతికకాయంపై ఉన్న జాతీయ జెండాను తీసి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. సంప్రదాయం ప్రకారం జస్వంత్‌కు తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తలకొరివి పెట్టారు.
అండగా ఉంటాం : సుచరిత
స్వశాన వాటికి వద్ద హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ శత్రుమూకల చేతిలో అశువులు బాసిన వీర జవాన్‌జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జస్వంత్‌ తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున రూ.50 లక్షల చెక్కును కోన రఘుపతి, జిల్లా కలెక్టర్‌తో కలిసి అందజేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోన రఘుపతి మాట్లాడుతూ దేశం కోసం వీర మరణం పొందిన జశ్వంత్‌రెడ్డి యువతకు ఆదర్శమన్నారు.జశ్వంత్‌రెడ్డి అంతిమయాత్రలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌, అర్బన్‌ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, సబ్‌ డివిజనల్‌ పరిధి ఎస్సైలు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img