పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడి అభిప్రాయం
గుండె సంబంధ సమస్యలు ఉన్నాయన్న డాక్టర్
ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్ ఉందని వెల్లడి
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నథ్) కోల్కతాలో ఓ సంగీత కచేరీ అనంతరం హఠాన్మరణం సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అస్వస్థతకు గురైన కేకేను కోల్ కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, కేకే భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం ఓ వైద్యుడు స్పందిస్తూ, అస్వస్థతకు గురైన వెంటనే సీపీఆర్ చేసుంటే కేకే బతికుండేవాడని అభిప్రాయపడ్డారు. కేకే చాలాకాలంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. కేకే గుండె రక్తనాళాల్లో పలుచోట్ల పూడికలు (హార్ట్ బ్లాకేజస్) ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడిరచారు. అవే గాయకుడి మరణానికి కారణమైనట్లు పంచనామాలో తేలింది. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడిరచారు. కేకే గుండెలోని ఎడమ ప్రధాన ధమనిలో దాదాపు 80 శాతం పూడిక ఉందని, ఇతర నాళాల్లోనూ చిన్న చిన్న పూడికలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సంగీత కచేరీలో పాడడం, డ్యాన్స్ చేయడం ద్వారా కేకే తీవ్ర ఉద్విగ్నతకు గురై ఉంటాడని, దాంతో రక్తప్రసరణ నిలిచిపోయి కార్డియాక్ అరెస్ట్ సంభవించిందని, అదే కేకే మరణానికి దారితీసిందని ఆ వైద్యుడు వివరించారు. కేకే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే సీపీఆర్ చేసి ఉన్నట్టయితే అతడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని ఆ వైద్యుడు పేర్కొన్నారు.