Friday, April 19, 2024
Friday, April 19, 2024

వెలిగొండ నిర్వాసితులకు
న్యాయంచేయాలి

. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు పరచాలి
. నిర్వాసితులతో ముఖాముఖిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`మార్కాపురం: సర్వం త్యాగం చేసిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు పరిచి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిథి బృందం శుక్రవారం ఉదయం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండవ సొరంగాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించింది. అనంతరం సుంకేసుల గ్రామంలో నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఇస్తామన్న ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం అత్యంత దారుణమన్నారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించడమేకాక 32 మండలాలు సస్యశ్యామలం అయ్యే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మొదటి టన్నెల్‌ ఎట్టకేలకు పూర్తయిందని, రెండవ టన్నెల్‌ ఇంకా 2.5 కిలోమీటర్ల మేరకు పని జరగాల్సి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే సంవత్సరం లోపు వెలిగొండను పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న నిర్మాణ పనులు పూర్తి కాలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని, మాటలు తప్ప చేతల్లో లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల కోసం, ముంపు గ్రామాల న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం సీపీఐ అన్ని వర్గాలను కలుపుకొని సమైక్య పోరాటాలు చేపట్టనున్నట్లు రామకృష్ణ చెప్పారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు అనేక రాయితీలను ప్రకటిస్తున్న పాలకవర్గాలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కించడం మంచిది కాదన్నారు. నిర్వాసితులకు సీపీఐ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తూ న్యాయం కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ త్యాగధనుల కళ్లమ్మట నీరు కార్పించడం మంచిది కాదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సీపీఐ పోరాడుతూనే మరోవైపు ముంపు గ్రామాల నిర్వాసితుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, పి హరినాధరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాధ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, నియోజకవర్గ కార్యదర్శి అందె నాసరయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దేవండ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img