Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు

రూ.16వేల కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి

ఒకేసారి 9,712 పోస్టులు భర్తీ
ఫిబ్రవరిలో మరో 14వేలు
రాష్ట్రవ్యాప్తంగా 10వేల విలేజ్‌ క్లినిక్స్‌
ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో విస్తరణ
కొత్తగా 16 బోధనాసుపత్రులు
అసెంబ్లీలో సీఎం జగన్‌ వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి, అత్యాధునిక వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోగ్యం అంశంపై సీఎం ప్రసంగించారు. వైద్యరంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అత్యాధునిక వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకోసం వైద్యరంగానికి అమిత ప్రాధాన్యతనిచ్చి వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రూ.16,225 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నామన్నారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనిస్తే ప్రతి ఒక్కరికీ తాము చేసిన కృషి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఆరోగ్యశాఖలో 9712 పోస్టులు భర్తీ చేశామని, మరో 14788 పోస్టులు వచ్చే ఫిబ్రవరిలోగా భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇక వైద్యసేవలు క్షేత్రస్థాయిలోకి అందుబాటులోకి తెచ్చేందుకు 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. వచ్చే 6 నెలల్లో తాము తెచ్చిన వైద్య సంస్కరణలన్నీ అమల్లోకి వస్తాయన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేసినట్లు సీఎం వివరించారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడంతోపాటు, ఇతర రాష్టాల్లోని 130 సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని, గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. గత 29 నెలలుగా ఆరోగ్యశ్రీపై దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, కేవలం 21 రోజుల్లో నెట్‌వర్క్‌ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామన్నారు. అలాగే వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్సలకు వైద్యసేవలందిస్తున్నామని వివరించారు. ఇక ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 11 టీచింగ్‌ ఆసుపత్రులు మాత్రమే ఉండగా, వైసీపీ ప్రభుత్వం ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు పెట్టడం ఒక రికార్డుగా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో కూడా కొత్తగా టీచింగ్‌ ఆస్పత్రి నిర్మాణం, ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. వైఎస్సార్‌ కంటివెలుగు ద్వారా 66 లక్షల పిల్లలకు పరీక్షలు చేశామని, 3 ప్రాంతాల్లో కొత్తగా చైల్డ్‌ కేర్‌ ఆస్పత్రులను నిర్మించనున్నామని తెలిపారు. కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. కరోనా బాధితులను 99.3శాతాన్ని రక్షించామని, ఇప్పటివరకు 87శాతం మందికి సింగిల్‌ డోసు వాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. ఈ చర్చలో మంత్రి ఆళ్ల నానితోపాటు, కొందరు శాసనసభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img