Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

. మోదీ ప్రసన్నం కోసమే విశాఖ సభ
. ప్రధాని రాకతో ఒరిగిందేమిటి: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఏపీకి మరోసారి మొండిచేయి చూపిన ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని, విభజన అంశాలు అమలయ్యేలా కృషి చేస్తానని 2019 ఎన్నికల్లో జగన్‌ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఇప్పుడు తన కేసుల నుంచి విముక్తి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్రధాని మోదీ ఎదుట సాగిలపడే పరిస్థితికి దిగజారారని ఆయన పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి మోదీ కోసం సీఎం జగన్‌ విశాఖ సభ నిర్వహించారని, ఇది కేవలం ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి ఆడిన డ్రామా తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ఏ ఒక్క అంశంపైనా మోదీ స్పందించలేదని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు అమలు చేసే అంశాలపై ప్రధాని స్పందించలేదని వివరించారు. మోదీ తాను అనుకున్నది చెప్పి వెళ్లిపోయారు తప్ప రాష్ట్రానికి మేలు జరిగేలా ఒక్క ప్రకటన చేయలేదని ఆరోపించారు. విశాఖ సభ విజయవంతం కోసం దాదాపు 7వేల మంది అధికారులను వినియోగించి, జనసమీకరణకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్రానికి సాధించిందేమిటో ప్రజలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర్ర ప్రయోజనాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మోదీ సర్కారుపై ముఖ్యమంత్రి గళమెత్తాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img