Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోంది..

ఇసుక, మద్యం మాఫియాల ద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీ..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు దోచుకుంటున్నారు
: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ

విశాలాంధ్ర`కదిరి : ప్రజల సమస్యలు గాలికి వదిలేసి వైసీపీ ప్రభుత్వం నిలువుదోపిడీకి పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. మంగళవారం కదిరిలో అత్తార్‌ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా కలుపుకొని ప్రజలపై పదేపదే భారాలు మోపుతూ ‘బాదుడే బాదుడు’ అనే పద్ధతుల్లో పాలన సాగిస్తున్నాయని, సీపీఐ ‘దంచుడే.. దంచుడు’ అనే పద్ధతులలో ప్రభుత్వలపై పోరాటానికి సమాయాత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు. ‘లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌’ పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమిని దర్జాగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేనల్లునికి చౌకబారు ధరకు కట్టబెట్టడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్న వారికి దోచుకున్నంత విధంగా పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా మద్యం మాఫియా ముఖ్యమంత్రి కనుసన్నాళ్లు లో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన బ్రాండ్ల ద్వారా వేలకోట్ల రూపాయలు కొల్లగొడుతూ ప్రతిరోజు 10 వేల కోట్ల రూపాయలు ఆ ఇంటికి మద్యం ద్వారా చేరుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి , ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి వారు దోచుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం రైతుల పరిస్థితి దీనంగా ఉందని పంటలన్నీ ఎత్తిపోయాయని అకాల వర్షాలు అధిక వర్షాల వలన వేరుశనగ కంది పంటలను వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని పంట పెట్టడానికి కూడా రైతులు ముందుకు రాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు పోరాటాలు చేయడానికి సమాయత్తమవుతున్నారని ఇందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలన్నారు. దిల్లీ నగర సరిహద్దు సింగ్‌ బార్డర్‌లో రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాలకు సమయతమవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రైతాంగ సమస్యలపై పోరాటాలు చేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. గత ప్రభ్యత్వ వేల కోట్ల రూపాయల ఖర్చుపెట్టి టిట్కో ఇల్లు ప్రభుత్వం నిర్మాణం చేపడితే లబ్ధిదారులకు వాటిని అప్పగించడానికి ఇష్టం లేని జగన్‌ రెడ్డి ఒక సైంధవుడులా అడ్డుపడుతున్నారని, లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం లేదని అన్నారు. డిసెంబర్‌ 5న జగనన్న కాలనీలలో ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని,మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సంబంధిత అధికారులకు అర్జీలు ఇచ్చే కార్యక్రమం సీపీిఐ పార్టీ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్‌, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య, అనంతపురం సీపీిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున,చేనేత రాష్ట్ర నాయకులు జింక చలపతి, పుట్టపర్తి సీపీఐ కార్యదర్శి ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బయన్న, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సురేంద్ర చౌదరి, బికేఎం కార్యదర్శి గంగాధర, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి రాజేంద్ర, ఏఐవైఎఫ్‌ కార్యదర్శి కుల్లాయప్ప, బీకేఎం కార్యదర్శి గంగాధర, పెనుగొండ సీపీిఐ కార్యదర్శి శ్రీరాములు, ధర్మవరం సిపిఐ కార్యదర్శి మధు, హిందూపురం సీపీిఐ కార్యదర్శి దాదా పీరా, మడకశిర సిపి కార్యదర్శి భాగ్యమ్మ, ఏఐకేఎస్‌ నాయకులు వేమనారాయణ, కదిరి సీపీిఐ కార్యదర్శి కదిరప్ప, రాప్తాడు సీపీిఐ కార్యదర్శి మహాదేవ్‌, మహిళా సంఘం నాయకురాలు లలితా బాయ్‌, జిల్లా లోని అన్ని మండలాల సీపీిఐ నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img