Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ బరితెగింపు

. పెద్దల పోరులో దొంగ ఓట్ల కలకలం
. ఉద్రిక్తత నడుమ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
. బహిరంగంగా ఓటర్లకు నగదు పంపిణీ
. తిరుపతిలో భారీగా దొంగ ఓటర్లు
. రీ`పోలింగ్‌కు ప్రతిపక్షాల డిమాండ్‌
. బిటెక్‌ రవి కారుపై వైసీపీ దాడి
. ఒంగోలులో పరస్పర ఘర్షణ
. ఉత్తరాంధ్రలో ప్రశాంతం
. సమస్యాత్మక కేంద్రాల్లో నిఘా: డీజీపీ
. పశ్చిమ రాయలసీమలో ఎన్నికల సరళి పరిశీలించిన రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పెద్దల పోరులోనూ దొంగ ఓటర్ల కలకలం నెలకొంది. వైసీపీ అధికార దాహంతో అడ్డదారులు తొక్కుతూ, అనర్హులకు ఓటు కల్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. పదో తరగతిలోపు చదివిన వారికి ఓటు హక్కు కల్పించింది. తిరుపతి కేంద్రంగా ఈ దొంగ ఓటర్ల భాగోతం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ఖాళీగా ఉన్న మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో దొంగ ఓటర్ల ప్రభావం భారీగా కన్పించింది. ఈ ఓటర్లను అడ్డుకున్న టీడీపీ, వామపక్ష నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రారంభం నుంచి దొంగ ఓటర్ల జాబితాపై ఎన్నికల అధికారికి ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ...వాటిని నిలువరించలేక పోయారు. దీంతోనే భారీగా ఎన్నికల్లో దొంగ ఓటర్లు, నగదు పంపిణీ సంఘటనలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, నాలుగు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగింది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురంకర్నూలు మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఈనెల 16వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురము, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దొంగ ఓటర్లను ఎన్నికల యంత్రాంగం, పోలీసులు నిలువరించలేకపోయారన్న విమర్శలొచ్చాయి. తిరుపతిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద భారీగా దొంగ ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పదో తరగతిలోపు చదివిన వారిని పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. అధికారులు సైతం దొంగ ఓటర్లను చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. వారిని అడ్డుకున్నందుకుగాను టీడీపీ నేతలపై వైసీపీ కార్యర్తలు రాళ్ల దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత తలను వైసీపీ కార్యకర్తలు పగులకొట్టారు. దీనికి నిరసనగా టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి ధర్నాకు దిగారు. ఎస్‌జీఎస్‌ కళాశాల పోలింగ్‌ స్టేషన్‌ ఎదుట సీపీఐ నేతలు బైఠాయించారు. తిరుపతిలో రీ`పోలింగ్‌ నిర్వహించాలని సీపీఐ, సీపీఎం, టీడీపీ డిమాండ్‌ చేశాయి. తిరుపతి యశోదనగరంలో ఓటర్లకు కరపత్రం, నగదును వైసీపీ కార్యకర్తలు బరితెగించి…బహిరంగంగా పంపిణీ చేసినప్పటికీ…పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ పట్టభద్రుల నియోజకవర్గానికి రూ.1000, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి రూ.2వేల చొప్పున లెక్కగట్టి పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ ఏకంగా నగదు పంపిణీపై మాట్లాడుతున్న వీడియోలు వెల్లడయ్యాయి. చాలా చోట్ల అధికార పార్టీ ప్రతినిధులే స్వయంగా నగదు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒంగోలు సెయింట్‌ థెరిస్సా పోలింగ్‌ కేంద్రం వద్ద రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓటర్లకు సాయం చేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టడంతో ఈ ఘటనకు దారితీసింది. దీంతో రెండు వర్గాలను పోలీసులు చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పట్టభద్రులైన ఓటర్లు గంటలకొద్దీ నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మరికొన్ని కేంద్రాలు వెలవెలబోయాయి. అటు సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 1535 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగిందని, ఇందులో 125 అత్యంత సమస్యాత్మక కేంద్రాలున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజూ పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పులివెందులలో ఉద్రిక్తత
పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉమ్మడి కడప జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో టీడీపీ ఎమ్మెల్సీ బి.టెక్‌ రవి కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేసి అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండుపార్టీల నేతలను చెల్లా చెదురుచేశారు. ఈ దాడిని బి.టెక్‌ రవి ఖండిరచారు. వైసీపీ అధికార దాహంతో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్ని పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లను రానీయకుండా చేయడానికి సీపీఐ బృందం అప్రమత్తంగా వ్యవహరించింది. తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రామకృష్ణ వెల్లడిరచారు. పోలింగ్‌ కేంద్రాలకు దొంగ ఓటర్లు రానీయకుండా సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు సిల్వర్‌ జూబ్లీ పోలింగ్‌ బూత్‌లో ఉపాధ్యాయులు భారీఎత్తున బారులు తీరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు
పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటును తెల్లం బాలరాజు వినియోగించుకున్నారు. శ్రీసత్యసాయిజిల్లా మడకశిర మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమడ మండల కేంద్రంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి దంపతులు పట్టభద్రుల ఓటు వేశారు. అనంతపురము రాజేంద్ర మున్సిపల్‌ పాఠశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఓటేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img