Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శభాష్‌ సర్గార్‌

వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం

61 కేజీల విభాగంలో గురురాజ పూజారీకి కాంస్యం
కామన్వెల్త్‌లో పతకాల ఖాతా తెరిచిన భారత్‌
ఈత విభాగంలో ఫైనల్‌కు చేరిన శ్రీహరి

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్‌ సంకేత్‌ మహదేవ్‌ సర్గార్‌ రజతంతో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్‌ సర్గార్‌ తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 135 కేజీల బరువెత్తిన మహదేవ్‌.. రెండు, మూడో ప్రయత్నంలో 139 కేజీల బరువు ఎత్తలేకపోయాడు. రెండో ప్రయత్నంలో గాయపడ్డ అతను.. మూడోసారి ప్రయత్నించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతని కుడి మోచేయి సహకరించలేదు. స్నాచ్‌ విభాగంలో మూడో ప్రయత్నంలో 113 కేజీల బరువు ఎత్తి టాప్‌లో నిలిచినప్పటికీ.. మలేషియా వెయిట్‌ లిఫ్టర్‌ అనిఖ్‌ కస్దాన్‌ మహదేవ్‌ను అధిగమించి గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలో చివరి ప్రయత్నంలో 142 కేజీల బరువుత్తి రికార్డు సృష్టించిన అనిఖ్‌.. స్నాచ్‌ విభాగంలో 107 కేజీలే ఎత్తాడు. ఓవరాల్‌గా 249 కేజీలు ఎత్తి టాప్‌లో నిలిచాడు. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు 225 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌ విభాగంలో 105 కేజీలు ఎత్తిన శ్రీలంక ప్లేయర్‌.. క్లీన్‌ అండర్‌ జర్క్‌లో 120 కేజీలు ఎత్తాడు.
అదరగొట్టిన శ్రీహరి
భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్‌ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌ సెమీఫైనల్‌ హాట్‌-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్‌ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్‌ రేసు ఆదివారం జరగనుంది. బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పాక్‌ను చిత్తు చేసి ఊపు మీదున్న భారత్‌ గ్రూప్‌-ఏ, లంకపైనా ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక పురుషుల మారథాన్‌ ఫైనల్‌లో భారత్‌ అథ్లెట్‌ రావత్‌ 17 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత్‌ ఖాతాలో మరో పతకం..
బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా చాటుతుంది. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్‌ బిన్‌ బిడిన్‌ మహ్మద్‌ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించారు. కాగా, గురురాజకు కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్‌ కోస్ట్‌ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img