Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శిథిలావస్థలో ప్రభుత్వ బడులు

విద్యార్థులకు తప్పని తిప్పలు
దళితవాడ స్కూళ్లపై చిన్నచూపు
పట్టించుకోని అధికారులు, పాలకులు

విశాలాంధ్ర`పెనుమంట్ర: విద్యారంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రమైన పెనుమంట్ర, నెగ్గిపూడి, సత్యవరం, కోమిటి చెరువు, తాళ్ల చెరువు, వనంపల్లి గ్రామాల్లోని దళితవాడల్లో గల ప్రభుత్వ పాఠశాలలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యార్థులు శిథిలమైన పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. నాడు-నేడు కింద దళితవాడల్లో నూతన పాఠశాలల భవన నిర్మాణాలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని నెగ్గిపూడి దళితవాడలో ఉన్న రెండు ప్రాథమిక పాఠశాలలు(ఎల్‌ఈ) పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వర్షం పడితే వర్షపు నీరు గదుల్లో నిలిచిపోతాయి. దీంతో ఐదేళ్ల క్రితం అక్కడ పాఠశాల కార్యకలాపాలను పక్కగ్రామం మార్టేరులో అద్దె భవనంలోకి మార్చి విద్యా బోధన చేస్తున్నారు. సత్యవరం చిన్నపేటలోని ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాన్ని ఏడేళ్ల క్రితం ప్రారంభించారు. అది పిల్లర్ల దశ నుండి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆ పాఠశాలను స్థానికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అదనపు తరగతి గదిలో నిర్వహిస్తున్నారు. ఆలమూరు చివర కామిటి చెరువు అరుంధతిపేటలోని ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడిపోయింది. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దీనిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఆర్థిక స్తోమతలేని తల్లితండ్రులు తమపిల్లల విషయంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల పైనే ఆధారపడి ఉన్నారు. శిథిలమైన ఈ భవనాల్లోనే విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కింద దళితవాడల్లో శిథిలావస్థకు చేరిన పాఠశాలలను పట్టించుకుందామన్న ఆలోచన ఎవరికీ రావడం లేదు. పెనుమంట్ర దళితవాడలోని పాఠశాల పరిస్థితీ ఇదే. తాగునీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్ల సమస్య, క్రీడా ప్రాంగణాలకు స్థలం కొరత, ప్రహరీలు లేక భద్రతా సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులలో పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల ఉన్నతికి సాయం చేసే అవకాశం తల్లిదండ్రుల పరిరక్షణ కమిటీలకు దక్కింది. ఈ కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రులదే కీలకపాత్ర. కమిటీలు చొరవ తీసుకొని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం: ఎంఈఓ శారద
పెనుమంట్ర మండలంలో పాఠశాలల పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదించామని ఎంఈఓ డి.శారద జోత్స్న విశాలాంధ్రకు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి నాడు`నేడు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాలలవారీగా సమస్యలు గుర్తించి మౌలిక సదుపాయాలు, నూతన భవన నిర్మాణాలు త్వరలో చేపడతామని, పాఠశాలల్లో ఉన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img