Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

శ్రీలంక కొత్త సారథి విక్రమసింఘె

కొలంబో: కొద్దినెలలుగా కొనసాగుతోన్న శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త నాయకత్వం కోసం బుధవారం జరిగిన ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్‌ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్‌ జరిగింది. రహస్య బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో రణిల్‌ విజయం సాధించారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక ప్రజలు రాజపక్స కుటుంబ పాలనతో విసిగిపోయారు. రాజపక్స సోదరులు అధ్యక్ష, ప్రధాని పదవులను నుంచి గద్దె దిగే వరకూ తీవ్రస్థాయి ఆందోళనలు చేపట్టారు. దాంతో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా.. రణిల్‌ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వం కోసం బుధవారం పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరిగింది. ఆ రేసులో రణిల్‌తో పాటు మరో ఇద్దరు పోటీలో నిలిచారు. అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) వర్గానికి చెందిన దులస్‌ అలహాప్పెరుమాతో పాటు వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకే పోటీ చేశారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) నాయకుడు సాజిత్‌ ప్రేమదాస.. అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు. దాంతో మొదట్లో దులస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 134 ఓట్లతో రణిల్‌కే విజయం దక్కింది. శ్రీలంకలో మొత్తం 225 స్థానాలున్నాయి. మెజార్టీ మార్కు కోసం కావాల్సిన సంఖ్య 113.
దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: రణిల్‌
శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత రణిల్‌ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందు పెను సవాళ్లున్నాయి’అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ద్వీపదేశం నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో అల్లాడిపోతోంది. దీన్నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది.
ఆగని ఆందోళనలు..
కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తైనా.. ఈ ద్వీప దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రణిల్‌ ఎన్నికపై ఆందోళనకారులు మండిపడ్డారు. అధ్యక్ష కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img