Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్షోభంలో జీడి రైతు

. దిగుబడి లేదు`గిట్టుబాటు ధర రాదు
. వ్యాపారుల సిండికేట్‌
. ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

విశాలాంధ్ర – లింగపాలెం: దిగుబడి లేక…గిట్టుబాటు ధర రాక జీడిమామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతు న్నారు. కుటుంబానికి జీవనాధారమైన జీడితోటలను నమ్ముకున్న రైతులు ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టున్నారు. తరతరాలుగా జీడిమామిడి తోటలే ధారంగా వేల మంది రైతులు జీవిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిరాశ చెందడం లేదు. ఈ తోటల ఆధారంతో చాలామంది ఆర్థికంగా స్థిరపడ్డారు. తరతరాలుగా జీడితోటలకు మంచి ఆదరణ ఉంది. జీడి మామిడి తోటలు ఐదెకరాలు ఉన్న రైతులే అధికం. ఏడాదంతా తోటలను శ్రద్ధగా పెంచుకుంటూ వస్తారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయంతో సంబరపడుతుంటారు. వచ్చిన ఆదాయంతో అవసరాలు తీర్చుకుంటారు. జీడితోటల ఆధారంతోనే తమ పిల్లలను ఉన్నతంగా చదివించి ఉద్యోగులుగా నిలబెట్టిన సంఘటనలు ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో అనేకం. మండలంలోని బోగోలు గ్రామం ఇందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు జీడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాలలో జీడితోటలు ఉన్నాయి. వీటిని ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీడి తోటల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా సబ్సిడీపై మొక్కలు సరఫరా చేస్తుంది. ఉద్యానవన పంటలకు సంబంధించి జీడి తోటలు ఆదాయాన్నిచ్చే పంటగా గుర్తించారు. కాగా దిగుబడి సరిగా రాక…వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లభించక జీడి రైతులు ఈ ఏడాది సంక్షోభంలో కూరుకుపోయారు. మంచు అధికంగా ఉండటం, అధిక వర్షాలకు పూత, పిందె రాలిపోయినట్లు రైతులు తెలిపారు. ఎకరాకి దాదాపు ఏడు క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి…అయిదు క్వింటాళ్లకే పరిమితమైంది. ఎకరాకి రూ.25 వేల పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. కాస్తోకూస్తో దిగుబడి వచ్చినా వ్యాపారులంతా సిండికేట్‌గా మారి…గిట్టుబాటు ధర అందకుండా అడ్డుపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటా జీడి గింజలతో 25 కిలోల పప్పు వస్తుందని, కిలో పప్పు ధర రూ.600 నుంచి రూ.1200 ఉంటుందని, అయితే వ్యాపారులంతా ఒక్కటై కిలో గింజలను రూ.95 నుంచి రూ.109లకు కొనుగోలు చేస్తున్నారని, ఇది అన్యాయమని రైతులు వాపోతున్నారు. కిలో గింజలకు రూ.140 నుంచి రూ.150 ధర చెల్లిస్తే ఆశాజనకంగా ఉంటుందని కోరుతున్నారు. జీడి గింజలకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ధర ఉన్నా, లేకపోయినా తరతరాలుగా ఈ పంటనే నమ్ముకుని జీవిస్తున్నామని, ఈ తోటలు తీసివేసి మరోపంట వేసేదిలేదని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img