Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంక్షోభ నివారణకు చర్యలేవీ

విద్యుత్‌ కష్టాలపై రామకృష్ణ సూటిప్రశ్న

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : విద్యుత్తు కొనుగోలులో గత ప్రభుత్వం కంటే ఎంతో ఆదా చేశామని చెబుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల బాదుడు ఎందుకో సమాధానం చెప్పాలని, బొగ్గు కొరతవిద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో, నాలుగు దఫాలుగా రూ.9వేల కోట్ల మేర విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని, స్లాబులు మార్చిందని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. సర్దుబాటు చార్జీల పేరుతో మరో రూ.3699 కోట్ల గుదిబండ ప్రజలపై వేసిందని పేర్కొన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అంతగా ఆదా చేసుంటే దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిత విద్యుత్‌ టారీఫ్‌

ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకున్నదో చెప్పాలని డిమాండు చేశారు. జాతీయ సౌర విద్యుత్‌ కార్పొరేషన్‌ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు పనులను అదానీకి కట్టబెడుతూ కేబినెట్లో హడావుడిగా ఎందుకు తీర్మానం చేశారని నిలదీశారు. నాలుగైదు కంపెనీలకు దక్కాల్సిన సౌరవిద్యుత్‌ ప్లాంట్‌ను అదానీ ఒక్కడికే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. బొగ్గు కొరత కారణంగా దేశంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తబోతోందన్న ప్రచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. 135 థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 190 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండు ఉండగా కనీసం 50శాతం జెన్‌కో ఉత్పత్తి చేయలేకపోతోందని చెప్పారు. విద్యుత్‌ వినియోగం తగ్గించుకోవాలని చెబుతూ విద్యుత్‌ కోతలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని డిమాండు చేశారు.
బండి సంజయ్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందించాలి
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ను, ఆయనకు మద్దతిచ్చిన వారిని తుకడా గ్యాంగ్‌ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సామరస్యపూరక వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అవసరం ఉందని రామకృష్ణ మరో ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మా ఎన్నికలు దూషణలతో వివాదాస్పదం కావడం బాధాకరమని, ఆ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగాయని తెలిపారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ ఎన్నికల్లో భాగస్వామి కాలేదని వివరించారు. అయినప్పటికీ ‘మా’ ఎన్నికల ఫలితాలనంతరం బండి సంజయ్‌…ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ వారిని, ఆయనకు మద్దతుగా నిలిచిన వారిని తుకడా గ్యాంగ్‌ అని సంబోధించడం సరికాదన్నారు. బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. బద్వేలు, హుజూరాబాద్‌ ఎన్నికలలో బీజేపీకి జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img